సౌదీ అరేబియాలో సాధారణంగా చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. తప్పు చేశారని నిరూపణ అయితే గుండు చేయడం, కాళ్లు, చేతులు తీసేయడం వంటివి ఆ దేశంలో చేస్తుంటారు. ఉరిశిక్షలు అమలు చేస్తున్న దేశాల్లో సౌదీ ఆరేబియా అగ్రస్థానంలో ఉందంటే అక్కడి ప్రభుత్వం నేరస్తుల పట్ల ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రికార్డు స్థాయిలో ఒకే రోజు 81 మందికి మరణ శిక్ష అమలు చేసింది. తీవ్రవాద గ్రూపులతో సంబంధాలు సహా వివిధ నేరాలకు పాల్పడిన 81 మందిని శనివారం ఉరితీసింది. వీరిలో కొందరు మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారని తెలుస్తోంది.
మరణశిక్షకు గురైన వారిలో కొందరు అల్ ఖైదా, ఐసిస్, యెమెన్ హౌతీ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. వీరిలో 73 మంది సౌదీ అరేబియా జాతీయులు కాగా ఏడుగురు యెమెన్ దేశస్తులు, ఒక సిరియా పౌరుడు కూడా ఉన్నారు. అయితే సౌదీ అరేబియా ప్రభుత్వం మరణశిక్షను అమలు చేయడానికి శనివారం ఎందుకు ఎంచుకుంది అనేది స్పష్టంగా తెలియరాలేదు. ప్రపంచం మొత్తం దృష్టి ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై కేంద్రీకృతమై ఉన్న సమయంలో ఈ పరిణామం జరగడం గమనార్హం.