Sailfish Stabbed 73 Year Woman Catherine In Florida: ‘‘హమ్మయ్యా.. 45 కిలోల (100 పౌండ్లు) చేప దొరికింది.. మనం పడ్డ కష్టానికి ఫలితం దక్కింది.. ఇక హాయిగా ఇంటికెళ్దాం’’ అని అనుకునేలోపు విషాదం చోటు చేసుకుంది. తాము ఏ చేపనైతే పట్టుకున్నారో, అదే వారిపై వాయువేగంతో దాడి చేసింది. ఈ ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. చేప దొరికిందని ఆనందించేలోపే, ఆ చేప ఆమెను బలిగొంది. ఈ విషాద సంఘటన ఫ్లోరాడాలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
ముగ్గురు మహిళలు ఒక పడవలో చేపల వేటకు వెళ్లారు. ఎంతోసేపు కష్టపడిన తర్వాత.. వారి వలలో ఒక చేప చిక్కుకుంది. అది కూడా మామూలు చేప కాదు.. 45 కిలోల బరువు ఉన్న సెయిల్ ఫిష్. దీంతో, తాము పడ్డ కష్టానికి పెద్ద ఫలితమే దక్కిందని ఆ మహిళలు ఆనందపడ్డారు. దాన్ని తీసుకొని, వెళ్దామని నిర్ణయించుకున్నారు. ఆ చేపను ఫిషింగ్ ట్రైలోకి వేయడం కోసం, పైకి లాగారు. అప్పుడు అది అనూహ్యంగా వారిపై దాడి చేసింది. గాలం నుంచి తప్పించుకోవడం కోసం ఆ మహిళలపై ఎటాక్‌కు పాల్పడింది. ఆ చేప దాడి చేస్తుందని ఆ మహిళలు ఏమాత్రం ఊహించలేకపోయారు.
ఈ దాడిలో 73 ఏళ్ల కేథరిన్ పెర్కిన్స్ మహిళ తీవ్రంగా గాయపడింది. దాంతో, స్నేహితులు ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, పరిస్థితి విషమించడంతో ఆ మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. సెయిల్ ఫిష్ అనేది అత్యంత వేగవంతమైన చేపజాతుల్లో ఒకటి. సముద్ర అడుగు భాగాన సంచరించే ఈ చేప.. అత్యంత బలంగా దాడి చేస్తుంది. దీని ముక్కు కత్తి ఆకారంలో పొడవుగా ఉంటుంది. శతృవుల్ని దాంతోనే ఎటాక్ చేస్తుంది. మహిళపై కూడా అలాగే ఎటాక్ చేయడంతో, ఆమె ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.