Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉక్రెయిన్ లోని తూర్పు ప్రాంతాలైన ఖేర్సన్, జపోరిజ్జియా, డోనెట్స్క్, లూహాన్స్క్ ప్రాంతాలను అధికారికంగా విలీనం చేస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం ప్రకటించారు. రష్యాలో నాలుగు కొత్త ప్రాంతాలు చేరాయని ఆయన అన్నారు. ఉక్రెయిన్ తో ఏడు నెలల యుద్ధంలో ఆ దేశానికి చెందిన తూర్పు భాగాలను రష్యా పాక్షికంగా ఆక్రమించుకుంది. తాజాగా జరిగిన ప్రజాభిప్రాయ సేకరణతో ఉక్రెయిన్ లోని ఈ నాలుగు ప్రాంతాలు రష్యాలో అధికారికంగా విలీనం అయ్యాయి.
Read Also: New Delhi: మలేషియన్ ఎయిర్‌లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు
శుక్రవారం రష్యాలో విలీనం అయిన నాలుగు ప్రాంతాలకు చెందిన నేతలు పుతిన్ తో సమావేశం అయ్యారు. వెస్ట్రన్ దేశాలు రష్యాను వలస రాజ్యం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని పుతిన్ ఆరోపించారు. కొత్తగా విలీనం అయిన ప్రాంతాల్లో అణ్వాయుధ వినియోగం గురించి పుతిన్ మాట్లాడుతూ.. అణ్వాయుధాలను రెండుసార్లు ఉపయోగించిన ఏకైక దేశం అమెరికా అని తీవ్ర విమర్శలు గుప్పించారు. మేము మా భూభాగాన్ని రక్షించుకుంటామని.. ఇది రష్యా ప్రజల విముక్తి పోరాటం అని ఆయన అన్నారు. ఈ నాలుగు ప్రాంతాల్లోని ప్రజలు ఎప్పటికీ రష్యా పౌరులే అని పుతిన్ అన్నారు. లూహాన్స్క్, డోనెట్క్స్, జపోరిజ్జియా, ఖేర్సర్ ప్రాంతాల్లోని ప్రజలు రష్యాలో చేరేందుకు సిద్ధ పడ్డారని వీరంతా ఇకపై మా ప్రజలే అని పుతిన్ స్పష్టం చేశారు.
ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ప్రారంభం అయిన యుద్ధం ఏడు నెలలుగా కొనసాగుతోంది. ఇదిలా ఉంటే తాజాగా విలీనం తరువాత తొలిసారిగా ఉక్రెయిన్ చర్చలకు రావాలని పుతిన్ కోరారు. ఇదిలా ఉంటే రష్యా నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ సరైంది కాదని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. ఈ నాలుగు ప్రాంతాలు రష్యా నియంతృత్వానికి లొంగవని ఉక్రెయిన్ హెచ్చరించింది. 2014 నుంచి ఈ నాలుగు ప్రాంతాల్లో రష్యా వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తోంది. తాజాగా ఈ ప్రాంతాలు రష్యాలో విలీనం అయ్యాయి. ప్రస్తుతం ఈ నాలుగు ప్రాంతాలు అధికారికంగా విలీనం చేసుకున్న తరువాత ఈ భూభాగాల్లోకి నాటో దళాలు అడుగుపెట్టలేవు.