Malaysia-Bound Flight Delayed After Bomb Hoax At Delhi Airport: ఢిల్లీ నుంచి మలేషియా వెళ్లాల్సిన విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. మలేషియన్ ఎయిర్‌లైన్స్ ఎంహెచ్ 173 విమానానికి బాంబు బెదిరింపులు రావడంతో ప్రయాణికుల్లో భయాందోళన వ్యక్తం అయ్యాయి. అయితే ఇద్దరు ప్రయాణికుల మధ్య గొడవ ఈ బాంబు బెదిరింపులకు కారణం అయింది. దీంతో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వెళ్లాల్సిన విమానం దాదాపుగా మూడు గంటల ఆలస్యంగా బయలుదేరింది. ఈ ఘటనకు కారణం అయిన నలుగురు ప్రయాణికులను పోలీసులు అరెస్ట్ చేశారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విమానం ఓవర్ హెడ్ క్యాబిన్ లో బ్యాగులను ఉంచే క్రమంలో ఇద్దరు ప్రయాణికుల మధ్య గొడవ చెలరేగింది. ఇందులో ఓ ప్రయాణికులు బ్యాగులో ఏముందని అడగ్గా.. మరొకరు బాంబు ఉందని సమాధానం ఇచ్చారు. దీంతో ఈ విషయాన్ని ప్రయాణికులు పైలెట్ కు తెలియజేశారు. వెంటనే పైలెట్ బాంబు బెదిరింపుల విషయాన్ని ఏయిర్ ట్రాఫిక్ కంట్రోలర్(ఏటీసీ)కి తెలియజేయడంతో విమానం టేకాఫ్ కావడాన్ని నిలిపివేసి అధికారులు క్షణ్ణంగా చెక్ చేశారు. ఆ తరువాత బాంబు బెదిరింపులు బూటకమని అధికారులు తేల్చారు. మొత్తం ఈ ఘటనకు కారణం అయినవారంతా భారతీయులే. బాంబు బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని వరీందర్ సిద్ధూగా పోలీసులు గుర్తించారు.
Read Also: Dussehra : పండుగకు ఊరెళుతున్నారా.. అయితే ఇది మీ కోసమే..!
ఇటీవల కాలంలో పలు విమానాలు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇటీవల రెండు రోజుల క్రితం అమెరికా శాన్ ప్రాన్సిస్కో నుంచి సింగపూర్ బయలుదేరిన సింగపూర్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానానికి కూడా ఇలాగే బాంబు బెదిరింపులు వచ్చాయి. ఆకాశంలో ఉన్న సమయంలో అమెరికాకు చెందిన ఓ ప్రయాణికులు క్యాబిన్ క్రూతో అసభ్యంగా ప్రవర్తిస్తూ.. విమానంలో బాంబు ఉందని బెదిరించాడు. దీంతో సింగపూర్ ఆర్మీకి చెందిన రెండు ఫైటర్ జెట్లు విమానానికి ఎస్కార్ట్ కల్పిస్తూ.. చాంగీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యేందుకు సహకరించాయి. ప్రయాణికులు డ్రగ్స్ మత్తులో ఉన్నట్లు అధికారులు తేల్చారు. అతడిని అరెస్ట్ చేశారు.