More than 300 children died in the war between Russia and Ukraine: రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమై ఏడు నెలలకు చేరింది. ఇప్పటికీ ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. రష్యా దాడిలో ఉక్రెయిన్ తీవ్రంగా నష్టపోతోంది. యుద్ధం ప్రారంభం అయ్యే ముందు పటిష్టమైన రష్యా ముందు కేవలం వారాల వ్యవధిలోనే ఉక్రెయిన్ లొంగిపోతుందని అంతా అనుకున్నారు. అయితే పాశ్చాత్య దేశాలు, అమెరికా, బ్రిటన్ వంటి నాటో దేశాలు ఇచ్చే ఆర్థిక, సైనిక సహాయంతో ఉక్రెయిన్ ఎదురొడ్డి నిలుస్తోంది. ఫిబ్రవరి 24న ప్రారంభమైన యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది.
ఇదిలా ఉంటే రష్యా దాడిలో తీవ్రంగా నష్టపోతోంది ఉక్రెయిన్. ఇప్పటికే ఉక్రెయిన్ లోని మరియోపోల్, ఖార్కివ్, సుమీ వంటి నగరాలతో పాటు రాజధాని కీవ్ కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇక డాన్ బోస్ రీజియన్ కూడా రష్యా దాడితో అతలాకుతలం అవుతోంది. రష్యా దాడి ప్రారంభం అయినప్పటి నుంచి ఉక్రెయిన్ లో 382 మంది పిల్లలు చనిపోయారని.. 741 మందికి పైగా గాయపడ్డారని.. ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయం వెల్లడించింది. డోనెట్స్క్ ప్రాంతంలో 388 మంది, ఖార్కివ్ ప్రాంతంలో 204 మంది, కీవ్ లో 116 మంది, మైకోలైవ్ లో 71 మంది, చెర్నిహివ్ లో 68 మంది, లుహాన్స్క్ లో 61 మంది, ఖేర్సన్ లో 55 మంది, జపోరిజియాలో 46 మంది పిల్లలు ప్రభావితం అయ్యారని తెలిపింది. ప్రతీ ఇద్దరు ఉక్రెయిన్ పిల్లల్లో ఒకరు శరణార్థిగా మారినట్లు ఐక్యరాజ్యసమితి అంచానా వేసింది.
ఈ రెండు దేశాల మధ్య యుద్ధం వల్ల రష్యాపై పాశ్చాత్య దేశాలు అనేక ఆంక్షలు విధించిన ప్రెసిడెంట్ పుతిన్ వెనుకడుగు వేయడం లేదు. ఉక్రెయిన్ తో పాటు నాటో దేశాలు, యూరోపియన్ దేశాలతో తాడోపేడో తేల్చుకోవాలనే అనుకుంటున్నారు. తాజాగా రష్యా నుంచి యూరోపియన్ దేశాలకు వెళ్లాల్సిన గ్యాస్ ను ఆపేశారు. అయితే గ్యాస్ లైన్ లో లీకేజీలు ఉండటంతోనే గ్యాస్ సరఫరాను నిలిపివేశామని రష్యా అంటుంటే.. కావాలనే రష్యా ఇలా చేసిందని యూరప్ దేశాలు ఆరోపిస్తున్నాయి. వచ్చే శీతాకాలంలో యూరప్ తో గ్యాస్ అవసరాలు తారాస్థాయికి చేరుతాయి. ఇదే అదనుగా రష్యా, యూరప్ దేశాలను ఇరుకున పెట్టాలని భావిస్తోంది.