Russia-Ukraine war: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మధ్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏడు నెలలు దాటినా కూడా ఈ రెండు దేశాల మధ్య యుద్ధతీవ్రత తగ్గడం లేదు. ఎటువైపు నుంచి ఏ రాకెట్ వచ్చిపడుతుందో అని తూర్పు ఉక్రెయిన్ ప్రాంతాలు వణికిపోతున్నాయి. మరోవైపు పాక్షిక సైనిక సమీకరణకు ఆదేశాలు ఇచ్చిన రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఉక్రెయిన్ పై దాడులను మరింతగా పెంచేలా ప్లాన్ వేస్తున్నారు. ఇదిలా ఉంటే దక్షిణ జపోరిజ్జియా ప్రాంతంలో దారుణానికి తెగబడింది రష్యా. ఓ పౌరకాన్వాయ్ పై దాడి చేసింది. రష్యా జరిపిన ఈ దాడిలో మొత్తం 23 మంది సాధారణ పౌరులు చనిపోయారని ఉక్రెయిన్ శుక్రవారం తెలిపింది. ఈ విషయాన్ని జపోరిజ్జియా ప్రాంతీయ గవర్నర్ ఒలెక్సాండర్ స్టారూఖ్ తెలిపారు. రష్యా దాడులకు తెగబడుతూ.. రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని ఆయన నిందించారు.
Read Also: Jammu kashmir: జమ్మూకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు జేఎం తీవ్రవాదుల హతం
ఉక్రెయిన్ జపొరిజ్జియా ప్రాంతంపై అక్కడ ఉన్న అణు విద్యుత్ కేంద్రంపై రష్యా దాడులు చేస్తోంది. దీనిపై ప్రపంచదేశాలు కలవరపడుతున్నాయి. ఈ అణు విద్యుత్ కేంద్రం పేలిపోతే యూరప్ వ్యాప్తంగా రేడియేషన్ తో ప్రభావితం అవుతుందని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. 7 లక్షల జనాభా ఉన్న జపొరిజ్జియా ఉక్రెయిన్ నియంత్రణలో ఉన్నప్పటికీ.. రష్యా పదేపదే దాడులు చేస్తోంది. ఈ ప్రాంతాన్ని రష్యాలో కలుపుకునేందుకు పుతిన్ భావిస్తున్నారు. అయితే జపొరిజ్జియా ప్రాంతంలో కొంత భాగాన్ని రష్యా ఇప్పటికే ఆక్రమించింది. అధికారికంగా ఈ ప్రాంతాన్ని రష్యా తనలో కలుపుకునేందుకు ప్రజాభిప్రాయసేకరణ చేసేందుకు సిద్ధం అయింది.
మరోవైపు ఉక్రెయిన్ యుద్ధంలో పట్టుకోల్పోతున్న రష్యా..మరింతగా దాడులు చేసేందుకు పాక్షిక సైనిక సమీకరణ చేయాలని ఇటీవల డిక్రీ జారీ చేశారు. రాబోయే రోజుల్లో యుద్దంలో 3 లక్షల మంది సైన్యాన్ని సమీకరించేందుకు సిద్ధం అయ్యారు. దీంతో రానున్న రోజుల్లో ఉక్రెయిన్ యుద్ధం మరింత తీవ్రం అయ్యే అవకాశం ఉంది. ఇప్పటి ఉక్రెయిన్ రాజధాని కీవ్, ఖార్కీవ్ వంటి ప్రాంతాల నుంచి తమ సైన్యాన్ని ఉపసంహరించుకుంది. ఉక్రెయిన్ కు నాటో ఇచ్చే ఆర్థిక, సైనిక సహాయంతో రష్యాకు ఎదురొడ్డి నిలబడుతోంది. దీంతో రష్యా నెమ్మదిగా ఉక్రెయిన్ పై పట్టు కోల్పోతోంది. ఈ నేపథ్యంలోనే రష్యా పాక్షిక సైనిక సమీకరణ చేయడంతో పాటు అవసరం అనుకుంటే అణుబాంబులు వేసేందుకు సిద్ధంగా ఉందని పుతిన్ నాటో, అమెరికా, వెస్ట్రన్ దేశాలకు వార్నింగ్ ఇచ్చారు.