రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంతో ఉక్రెయిన్ లోని నగరాలు అట్టుడుకుతున్నాయి. యుద్ధం ఇవాళ్టికి 17వ రోజుకు చేరుకుంది. రష్యా మాత్రం తన పట్టువీడడం లేదు. ఉక్రెయిన్ నగరాలపై రష్యా బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది. బాంబుదాడులతో పలు నగరాలకు పూర్తిగా ధ్వంసమై శ్మశానాలను తలపిస్తున్నాయి. లక్షలాదిమంది ప్రజలు ఉక్రెయిన్‌ను విడిచి వలస పోతున్నారు. 10 లక్షలమంది వరకూ వలస వెళ్ళి వుంటారని అంతర్జాతీయ సంస్థలు చెబుతున్నాయి. ఉక్రెయిన్ లోని అనేక నగరాలు రష్యా సైన్యం అధీనంలోకి వెళ్లినట్టు చెబుతున్నారు.
మెలిటిపోల్, ఖేర్సన్, బెర్డీయాన్స్క్, స్టారోబిలిస్క్, నోవోప్స్‌కోవ్ వంటి నగరాలు ప్రస్తుతం రష్యన్ దళాల నియంత్రణలో ఉన్నాయి. అయితే ఆయా నగరాల పౌరులు మాత్రం చివరి వరకూ రష్యన్ సేనలను ఎదురిస్తూనే ఉన్నారు. ఉక్రెయిన్ దక్షిణ నగరమైన మెలిటోపోల్ రష్యన్ సేనల నియంత్రణలోకి వెళ్లి చాలా రోజులు అయింది. అక్కడ ఇంటర్నెట్ సేవలు పూర్తిగా నిలిచిపోవడంతో అసలేం జరుగుతుందో పౌరులకు అంతుచిక్కడం లేదు. వాట్సాప్, టెలిగ్రామ్ వంటి సేవలు నిలిచిపోవడంతో స్నేహితులు, కుటుంబాల మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయని ఆవేదన చెందుతున్నారు.
నగర మేయర్ ఇవాన్ ఫెడెరోవ్‌ను రష్యా దళాలు కిడ్నాప్ చేసినట్టు తెలుస్తోంది. అజ్ఞాతంలో ఉన్న ఆయన రష్యా సేనలకు సహకరించేందుకు నిరాకరించడంతో కిడ్నాప్ చేసినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా రష్యా దళాలకు సహకరించేది లేదని ఇవాన్ ఇది వరకే స్పష్టం చేశారు. ఇవాన్ కిడ్నాప్‌పై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తీవ్రంగా స్పందించారు. ప్రజాస్వామ్యంపై ఇది యుద్ధ నేరమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ సమాజం దీనిని ఖండించాలంటున్నారు జెలెన్ స్కీ.