Russia Says No Chance Of Peace Talks As Zelenskiy Travels To Washington: ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలన్ స్కీ బుధవారం అమెరికాలో పర్యటించారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో భేటీ కావడంతో పాటు కాంగ్రెస్ ను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇదిలా ఉంటే జెలన్ స్కీ అమెరికా పర్యటనపై రష్యా తీవ్రంగా స్పందించింది. బుధవారం జెలన్ స్కీ వాషింగ్టన్ పర్యటన వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని.. ఉక్రెయిన్ తో ఇక శాంతి చర్చలకు అవకాశం లేదని రష్యా పేర్కొంది. క్రెమ్లిన్ అధికార ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్ కు పాశ్చాత్య దేశాల ఆయుధ సరఫరా సంఘర్షణను మరింత తీవ్రం చేస్తుందని, ఉక్రెయిన్ కు ఎదురుదెబ్బ తప్పని ఆయన హెచ్చరించారు.
Read Also: Sanjay Raut: చైనా లాగే కర్ణాటకలోకి ప్రవేశిస్తాం.. ముదిరిన మహా-కర్ణాటక వివాదం
ఈ ఏడాది ఫిబ్రవరి 24న రష్యా-ఉక్రెయిన్ల మధ్య యుద్ధం ప్రారంభం అయింది. యుద్ధం ప్రారంభం అయిన తర్వాత తొలిసారిగా జెలన్ స్కీ మాతృదేశం దాటి అమెరికా వెళ్లారు. అయితే జెలన్స్కీ పర్యటన వల్ల ఏదైనా సానుకూల నిర్ణయాలు ఉంటాయా..? అని అడిగితే రష్యా లేదని చెప్పింది. ఇదిలా ఉంటే ఇప్పటికే రష్యా, ఉక్రెయిన్ పై దాడులను తీవ్రం చేసింది. గత శుక్రవారం ఏకంగా 70 కన్నా ఎక్కువ క్షిపణులతో రాజధాని కీవ్ తో పాటు ఇతర ప్రాంతాలపై విరుచుకుపడింది. దీంతో ఉక్రెయిన్ వ్యాప్తంగా విద్యుత్ వ్యవస్థ దెబ్బతిని అంధకారం ఏర్పడింది.
ఉక్రెయిన్, అమెరికా నుంచి మరింతగా ఆర్థిక, ఆయుధ సాయాన్ని పొందేందుకు జెలన్ స్కీ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఇందులో అమెరికా తయారీ పేట్రియట్ ఎయిర్ ఢిపెన్స్ క్షిపణులు ఉన్నాయి. రష్యా డ్రోన్ల నుంచి ఉక్రెయిన్ ను రక్షించుకోవడానికి పేట్రియాట్ క్షిపణి వ్యవస్థ సహాయపడుతుంది జెలన్ స్కీ భావిస్తున్నారు.