Russia vs America: రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రీ మెద్వదేవ్ వార్నింగ్ కు ప్రతిస్పందనగా.. ఆ దేశానికి చేరువలో సముద్ర జలాల్లో రెండు అణు జలాంతర్గాములను అగ్రరాజ్యం మోహరించింది. దీనిపై తాజాగా రష్యా పార్లమెంటు సభ్యుడు విక్టర్ వోడోలాట్స్కీ మాట్లాడుతూ.. అమెరికాను ఎదుర్కొనేందుకు తమ వద్ద కూడా తగినన్ని అణు జలాంతర్గాములు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఇంకా చెప్పాలంటే, యూఎస్ జలాంతర్గాముల కంటే తమవి చాలా ఎక్కువని తెలియజేశారు. అగ్రరాజ్యం మోహరించినవి తమ జలాంతర్గాముల నియంత్రణలో ఉన్నాయి.. కాబట్టి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనలకు ప్రతిస్పందించాల్సిన అవసరం లేదని వెల్లడించారు.
Read Also: Trump: రష్యా-అమెరికా మధ్య ఉద్రిక్తతలు.. అణు జలాంతర్గాముల మోహరింపునకు ట్రంప్ ఆదేశం
ఇక, ట్రంప్ వ్యాఖ్యలపై గ్లోబల్ అఫైర్స్ మ్యాగజైన్ రష్యా ఎడిటర్ ఇన్‌చీఫ్ ఫ్యోడర్ లుక్యానోవ్ స్పందిస్తూ.. అమెరికా హెచ్చరికలను ప్రస్తుతానికి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. కాగా, మాస్కో, అమెరికా మధ్య ప్రత్యక్ష సైనిక ఘర్షణలు జరగకూడదని యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో వాదనతో తాను ఏకీభవిస్తానని రష్యా విదేశాంగ మంత్రి సెర్గా లావ్రోవ్ తెలియజేశారు. అయితే, రష్యాకు సమీపంలోని సముద్ర జలాల్లో రెండు అణు జలాంతర్గాములను మోహరించాలని ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా ఆదేశించారు. దిమిత్రీ రెచ్చగొట్టే వ్యాఖ్యల వెనక ఏదైనా ఉద్దేశాలు ఉంటే వాటికి రెడీ అయ్యేందుకు ఇలా చేసినట్లు చెప్పుకొచ్చారు.