Russia Condemns Western Blackmail: ఇండియాలో జరుగుతున్న జీ20 విదేశాంగ మంత్రుల సమావేశాలకు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ హాజరయ్యారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో పాశ్చాత్యదేశాలు బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నాయని, ఇందుకు జీ20 సమావేశాలను వేదికగా ఉపయోగించుకుంటున్నాయని ఆరోపించారు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిని సంస్కరించడానికి ఇదే మంచి సమయం అని లావ్రోవ్ అన్నారు. వెస్ట్రన్ దేశాలు అనేక ఏళ్లుగా రష్యాపై యుద్ధానికి ప్రయత్నిస్తున్నాయని, అందుకే ఉక్రెయిన్ కు భారీగా ఆయుధాలను అందిస్తున్నాయని దుయ్యబట్టారు.
Read Also: Election Results: ఈశాన్య భారతంలో రెపరెపలాడిన కాషాయ జెండా.. మరోసారి సత్తాచాటిన బీజేపీ
పాశ్చాత్య దేశాలు ఇప్పటి తన వలసవాద మనస్తత్వాన్ని వదులుకోవడం లేదని, ప్రపంచ ప్రయోజనాల కన్నా వారి ప్రయోజనాలనే చూసుకుంటున్నారని, పశ్చిమ దేశాలు, ఇతర దేశాల భూమిని స్వాధీనం చేసుకుని ప్రజలను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. ప్రతీ దేశం కూడా ఇతర దేశాల సార్వభౌమధికారం, ప్రాదేశిక సమగ్రతకు కట్టుబడి ఉండాలని యూఎన్ చార్టర్ లో ఉందని లావ్రోవ్ గుర్తు చేశారు.
జీ20 సమావేశాల్లో ప్రధాని మోదీ బాధ్యతాయుత పాత్రను పోషిస్తున్నారని, ఆయన ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులను అంచనా వేశారని అన్నారు. ఇతర దేశాలతో సంబంధాలు పెంచుకోవాలనుకునే దేశాలను రష్యా ఎప్పుడు వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. భారత్, రష్యా సంబంధాలను అత్యంత వ్యూహాత్మక భాగస్వామ్యంగా అభివర్ణించారు. ప్రపంచ ఎజెండాలపై భారత్ తీసుకుంటున్న బాధ్యతాయుతమైన నిర్ణయాలను తాము అభినందిస్తున్నట్లు వెల్లడించారు. వెస్ట్రన్ దేశాలు రష్యాను ఒంటరి చేద్దాం అని భావించుకుంటూ, వాటికవే ఒంటరిగా మారుతున్నాయని అన్నారు. పశ్చిమ దేశాలు ప్రజాస్వామ్య సూత్రాలను గౌరవిస్తే, ప్రపంచవ్యాప్తంగా ఎందుకు వాటిని అమలు చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. పాశ్యాత్య దేశాలు దౌత్యం గురించి ఆలోచించడం లేదని, కేవలం బ్లాక్ మెయిల్ మాత్రమే చేస్తున్నారంటూ లావ్రోవ్ మండిపడ్డారు.