Israel-Hamas: ఇజ్రాయిల్‌పై హమాస్ ఉగ్రవాదుల దాడి భీకర యుద్ధానికి దారి తీసింది. శనివారం తెల్లవారుజామున హమాస్ మిలిటెంట్లు గాజా ప్రాంతం నుంచి ఇజ్రాయిల్ పైకి రాకెట్లతో దాడి జరిపారు. ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ ని ఏమార్చి సరిహద్దులు దాటి ఇజ్రాయిల్ పౌరులను చంపారు. పలువురిని బందీలుగా పట్టుకుని గాజాలోకి తీసుకెళ్లారు. ఇప్పటికే ఈ యుద్ధంలో 1600 మంది చనిపోయారు. ఇరువైపులా ప్రాణనష్టం భారీగా ఉంది. ఇప్పటికే హమాస్ జరిపిన దాడిలో 900 మంది ఇజ్రాయిలీ పౌరులు చనిపోగా.. గాజాలో 700 మంది ఇజ్రాయిల్ జరిపిన దాడిలో మరణించారు.
ఇదిలా ఉంటే హమాస్ వెనక ఇరాన్ ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఇరాన్ సుప్రీంలీడర్ సలహాదారు హమాస్ దాడిని స్వాగతించారు. ఈ దాడిని చూస్తే గర్వంగా ఉందని వ్యాఖ్యానించారు. హమాస్‌కి చెందిన ఉగ్రనాయకులు కూడా ఈ దాడికి ఇరాన్ సహకరించిందనే వ్యాఖ్యలు చేశారు.
Read Also: Gang War: “భాయ్” అనలేదని కత్తితో పొడిచి, కాల్చి చంపిన వైనం..
ఇదిలా ఉంటే ఆరోపణల్ని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మంగళవారం ఖండించారు. పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ కి మద్దతుగా ఉన్నప్పటికీ.. ఈ దాడిలో ఇరాన్ ప్రమేయం లేదని, కావాలనే ఇజ్రాయిల్ ఇలాంటి తప్పుడు ఆరోపణల్ని తీసుకువస్తోందని మిలిటరీ అకాడమీ వద్ద చేసిన ప్రసంగంలో వ్యాఖ్యానించారు.
మేము పాలస్తీనాను సమర్థిస్తాం, పోరాటాలను సమర్థిస్తాం, మొత్తం ఇస్లామిక్ ప్రపంచం పాలస్తీనియన్లకు మద్దతు ఇవ్వాలని ఖమేనీ కోరారు. ఇజ్రాయిల్ సైనిక, ఇంటెలిజెన్స్ రెండింటిలోనూ కోలుకోలేని వైఫల్యాన్ని చవిచూసిందని అన్నారు. మరోవైపు హమాస్ కి మద్దతుగా లెబనాన్ నుంచి ఇజ్రాయిల్ పైకి హిజ్బుల్లా మిలిటెంట్ సంస్థ దాడులు చేస్తోంది. ఈ సంస్థకు కూడా ఇరాన్ నుంచి బలమైన మద్దతు ఉంది.