గొటబాయ రాజపక్స రాజీనామాను పార్లమెంట్ స్పీకర్ మహింద యాపా అబేవర్దన ఆమోదించడంతో శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే శుక్రవారం తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తి జయంత జయసూర్య విక్రమసింఘేతో తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయించారు.
విక్రమసింఘేను మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స జులై 13న తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించారు. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన భారీ నిరసన కారణంగా మాల్దీవులకు పారిపోయారు. అక్కడి నుంచి సింగపూర్ వెళ్లారు.
సింగపూర్‌కు చేరుకున్న గొటబాయ రాజపక్స అధ్యక్ష పదవికి అధికారికంగా రాజీనామా చేస్తూ లేఖను గురువారం స్పీకర్‌కు పంపించారు. దీనిపై స్పీకర్ అబేవర్దన స్పందిస్తూ.. అధ్యక్షుడి రాజీనామా ఆమోదించబడిందని వెల్లడించారు. చట్టపరంగా అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ కొనసాగుతుందన్నారు. జులై 14న అధ్యక్షుడు తన బాధ్యతల నుంచి తప్పుకున్నారని చెప్పారు. 1981లోని ప్రత్యేక నిబంధనల చట్టం నెం.2, రాజ్యాంగంలోని 40వ అధికరణ నిబంధనల ప్రకారం అధ్యక్షుడిని ఎంపిక చేస్తామని అబేవర్దన తెలిపారు. అధ్యక్ష ఎన్నికను విజయవంతంగా, వేగంగా పూర్తి చేయాలనేదే తన ఉద్దేశమని స్పీకర్ వెల్లడించారు. ఈ ప్రక్రియను పారదర్శకంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో పూర్తి చేయడం శ్రీలంక చరిత్రలోనే కాకుండా ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్ర ఒక మైలురాయి అవుతుందన్నారు.
MonkeyPox: మంకీపాక్స్ పై కేంద్రం అలర్ట్.. మార్గదర్శకాలు జారీ
మాల్దీవుల నుంచి వెళ్లిన రాజపక్సే గురువారం సాయంత్రం సౌది ఎయిర్‌లైన్స్ విమానంలో సింగపూర్ చేరుకున్నారని మీడియా కథనాలు తెలిపాయి. రాజపక్స, ఆయన భార్య సింగపూర్‌లో ఉంటారని సమాచారం. 73 ఏళ్ల రాజపక్స జులై 9న తన నివాసంపై నిరసనకారులు మూకుమ్మడిగా దాడి చేయడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. బుధవారం తన రాజీనామా లేఖను అందజేస్తానని ఆయన ప్రకటించారు. అంతకుముందు, రాజపక్స తన భార్యతో కలిసి మాల్దీవులకు పారిపోయారు. ఆ తర్వాత శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రధాని రణిల్ విక్రమసింఘేను స్పీకర్ నియమించారు.