Plane Crash in Greece: గ్రీస్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఉత్తర గ్రీస్‌లో ఒక కార్గో విమానం కూలిపోయింది. సెర్బియా నుంచి భారీ మొత్తంలో మందుగుండు సామగ్రిని మోసుకెళ్తున్న ఆంటోనోవ్-12 కార్గో విమానం ఉత్తర గ్రీస్‌లోని రెండు గ్రామాల మధ్య కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఉక్రెయిన్ దేశానికి చెందిన 8 మంది విమానయాన సిబ్బంది మృత్యువాతపడ్డారు. తమ దేశంలో తయారైన 11.5 టన్నుల మందుగుండు సామగ్రిని బంగ్లాదేశ్ కొనుగోలు చేసిందని.. దాన్ని తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని సెర్బియా రక్షణ మంత్రి నెబోజా స్టెఫెనోవిచ్ తెలిపారు. విమానం కూలిపోయేటప్పుడు పెద్ద అగ్నిగోళంలా కనిపించిందని.. దాదాపు 2 గంటల పాటు భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయని స్థానికులు తెలిపారు.
పొగ, తీవ్రమైన వేడి, ఘటన జరిగిన ప్రదేశం సమీపంలో తెల్లటి పదార్థం భయాందోళనకు గురి చేసిందని గ్రీకు అగ్నిమాపర దళం ప్రధానాధికారి మారియోస్ అపోస్టోలిడిస్ చెప్పారు. ‘విమానం కుప్పకూలినప్పుడు అప్పటికే కాలిపోతోంది. అగ్నిగోళం, అణుబాంబు లాంటి పెద్ద పేలుడు సంభవించింది’ అని స్థానిక వ్యక్తి ఒకరు వెల్లడించారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఇప్పటివరకు ఎటువంటి ప్రమాదకరమైన పదార్థాలు కనుగొనబడలేదని గ్రీక్ ఫైర్ సర్వీస్ ప్రతినిధి ఐయోనిస్ ఆర్టోపోయోస్ తెలిపారు. విమానంలో ఉన్న మొత్తం 8 మంది మృతదేహాలను గ్రీస్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఉక్రేనియన్ కార్గో ఎయిర్‌లైన్ మెరిడియన్ నడుపుతున్న ఆంటోనోవ్-12 రాత్రి 11 గంటల ముందు కుప్పకూలింది.
Gujarat Rains: రోడ్డు మధ్యలో భారీ గొయ్యి.. సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్
సెర్బియా నుంచి జోర్డాన్ మీదుగా బంగ్లాదేశ్‌కు వెళ్తుండగా ప్రమాదానికి గురైనట్లు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒలేగ్ నికోలెంకో ఆదివారం ఫేస్‌బుక్‌లో తెలిపారు. ప్రమాదానికి ఇంజన్ ఫెయిల్ కావడమే కారణమని భావిస్తున్నారు. ఉక్రేనియన్ కాన్సులేట్ అధికారులు, స్థానిక రెస్క్యూ బృందాలు ఘటనా స్థలంలో చర్యలు చేపట్టాయని ఆయన చెప్పారు. నిపుణులు కూడా తెల్లని పదార్థం ఏమిటో గుర్తించే పనిలో ఉన్నారు. విమానం ఫ్లైట్ రికార్డర్‌ను అధికారులు ఇంకా రికవరీ చేయలేదు.