Pakistan: పాకిస్తాన్ అణ్వాయుధాలను అమెరికా టార్గెట్ చేసిందని ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ ఆరోపించారు. 2004 జనవరి 20న పదవీ బాధ్యతలను చేపట్టనున్న అమెరికా అధ్యక్షుడికి డొనాల్డ్ ట్రంప్‌కి రాయబారిగా ఉన్న రిచర్డ్ గ్రెనెల్ పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విడుదల చేయాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) చీఫ్ ఈ సంచలన ఆరోపణలు చేశారు. ఇమ్రాన్ ఖాన్‌పై తప్పుడు అభియోగాలు మోపినట్లు గ్రెనెల్ చెప్పారు.
‘‘నేను ఇమ్రాన్ ఖాన్ విడుదల కావాలని అననుకుంటున్నాను. ప్రస్తుతం అతను జైలులో ఉన్నాడు. ట్రంప్ లాగే అతను కూడా అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. అక్కడి అధికార పార్టీ అతడిని జైలులో పెట్టింది. ఒక విధమైన తప్పుడు ఆరోపణలను సృష్టించింది’’ అని గ్రెనెల్ అన్నారు.
Read Also: Bangladesh: మరో భారత వ్యతిరేకిని విడుదల.. పీఓకేలో ఉగ్రవాదానికి సాయం..
ఇమ్రాన్ ఖాన్‌పై గ్రెనెల్ చేసిన ప్రకటనపై బిలావల్ భుట్టో స్పందించారు. పాకిస్తాన్‌పై కుట్ర పన్నిన వారు ఇప్పుడు జైలులో ఉన్నారని, అతడికి అనుకూలంగా ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ‘‘మనం ఐక్యంగా ఉండి పాకిస్థాన్‌పై జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టాలి. రాజకీయాలను పక్కనబెట్టి మన దేశం, దాని రక్షణ గురించి ఆలోచించాలి’’ అని అన్నారు. బిలావల్ భుట్టో తల్లి, మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో 17వ వర్థంతి సందర్భంగా శుక్రవారం సింధ్ ప్రావిన్సులోని గర్హిఖుదా బక్ష్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రసంగించారు.
అమెరికా పాకిస్తాన్ అణ్వాయుధాలను, క్షిపణి కార్యక్రమాలను లక్ష్యంగా చేసుకోవడానికి కుట్ర పన్నుతోందని, పాక్ అంతర్గత విషయాల్లో అమెరికా జోక్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా ఇమ్రాన్ ఖాన్‌పై చేసిన ప్రకటన ఒక సాకు మాత్రమే అని, దాని అసలు లక్ష్యం పాకిస్తాన్ అణు కార్యక్రమమని చెప్పారు. అమెరికా చేసిన ప్రకటనపై ఇమ్రాన్ ఖాన్ తన వైఖరిని స్పష్టం చేయాలని బిలావల్ భుట్టో డిమాండ్ చేశారు. డొనాల్డ్ ట్రంప్ తన అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో పాకిస్తాన్ అణ్వాయుధాల గురించి ఆందోళన వ్యక్తం చేయడాన్ని భుట్టో ప్రస్తావించారు.