Pakistan floods death toll crosses 1,000, rainfall continues: దాయాది దేశం పాకిస్తాన్ వరదలతో వణుకుతోంది. భారీ వర్షాలు, వరదలు ఆ దేశాన్ని కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. ఇప్పటికే తీవ్రమైన ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్న పాకిస్తాన్ దేశం.. వరదల కారణంగా మరింత సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పాకిస్తాన్ లోని సింధ్, బలూచిస్తాన్ ప్రావిన్సులు దారుణంగా దెబ్బతిన్నాయి. దీంతో పాటు పంజాబ్, గిల్గిత్ బాల్టిస్థాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సుల్లో కూడా వరద ప్రభావం ఉంది. జూన్ 14 నుంచి ఇప్పటి వరకు పాకిస్తాన్ వరదల వల్ల 1033 మంది ప్రాణాలు కోల్పోయారు. 1527 మంది గాయపడ్డారని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో పాకిస్తాన్ లో 119 మంది మరణించారు.
పాకిస్తాన్ లోని భారీ వరదలు వల్ల ఇప్పటి వరకు 3,451 కిలోమీటర్ల రోడ్లు దెబ్బతిన్నాయి. 6,62,446 ఇళ్లు పాక్షికంగా దెబ్బతింటే.. 2,87,412 పూర్తిగా నాశనం అయ్యాయి. 7,19,558 పశువులు మరణించాయి. పాకిస్తాన్ వ్యాప్తంగా 110 జిల్లాల్లో వరద ప్రభావం ఎక్కువగా ఉంది. 72 జిల్లాలు మాత్రం తీవ్రంగా దెబ్బతిన్నాయి. దశాబ్ధకాలంలో ఎన్నడూ లేని విధంగా పాకిస్తాన్ వర్షాలు, వరదల్ని ఎదుర్కొంటోంది. దీంతో పాక్ ప్రభుత్వం ‘‘ నేషనల్ ఎమర్జెన్సీ’’ని విధించింది. దాదాపుగా 5,773,063కోట్ల మంది వరదల వల్ల ప్రభావితం అయ్యారని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. అయితే వాస్తవంగా ఈ సంఖ్య కన్నా 33 రెట్లు అధికంగా ప్రజలు ప్రభావితం అయినట్లు తెలుస్తోంది.
Read Also: CWC Meeting: నేడు కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం.. అధ్యక్షుడి ఎన్నిక షెడ్యూల్ ఖరారు.!
గత 30 ఏళ్ల డేటా ప్రకారం పాకిస్తాన్ లో రుతుపవన కాలంలో సగటున 134 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అవుతుంది.. అయితే ఈ ఏడాది మాత్రం ఏకంగా 388.7 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయింది. అంటే సగటు కన్నా 190.07 శాతం ఎక్కువ వర్షపాతం నమోదు అయింది. సింధ్ ప్రావన్స్ గత 30 ఏళ్లలో లేని విధంగా ఐదున్నర రెట్లు అధికంగా వర్షపాతం పొందింది. బలూచిస్తాన్ ప్రావిన్సులో ఐదు రెట్ల అధిక వర్షపాతం నమోదు అయింది. కాబూల్, సింధు నదులు, దాని ఉపనదులు ప్రమాదకర రీతిలో ప్రవహిస్తున్నాయి.