Sonia Gandhi to hold CWC meet today: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం ఆదివారం జరగనుంది. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ వర్చువల్ గా ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి షెడ్యూల్ ఖరారు చేయనున్నారు. అనారోగ్య కారణాలతో సోనియా గాంధీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, లీడర్లు రాహుల్ గాంధీని అధ్యక్షుడిని చేయాలని కోరుతున్నారు. అయితే అధ్యక్షుడిగా పదవిని స్వీకరించడానికి రాహుల్ సుముఖంగా లేరని తెలుస్తోంది.
అయితే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గులామ్ నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత జరుగుతున్న ఈ సమావేశంలో వాడీవేడి చర్చ జరిగే అవకాశం ఉంది. గులాం నబీ ఆజాద్ పార్టీకి రాజీనామా చేస్తూ.. రాహుల్ గాంధీ నాయకత్వంపై కీలక విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత మార్పులు, నాయకత్వ మార్పు గురించి పలు సందర్భాల్లో ప్రశ్నించిన జీ -23 గ్రూపులో కీలక సభ్యుడిగా ఉన్నారు ఆజాద్.
Read Also: Child Marriage: 62 ఏళ్ల అధికార పార్టీ నేత నిర్వాకం.. 16 ఏళ్ల బాలికతో పెళ్లి..!
ఇదిలా ఉంటే ఆదివారం మధ్యాహ్నం 3.30 నిమిషాలకు సీడబ్ల్యూసీ మీటింగ్ ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ నేతలు సోనియా, రాహుల్ గాంధీల నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ ఏడాది ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 20 మధ్య కొత్త అధ్యక్షుడి నియామకం జరుగుతుందని గతేడాది అక్టోబర్ లోనే కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
రాహుల్ గాంధీనే అధ్యక్ష పదవిని చేపట్టాలని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లట్ వంటి వారు కోరుతున్నారు. అయితే ఈసారి మాత్రం గాంధీయేతర వ్యక్తే కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. గతంలో 2019లో లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం తరువాత అధ్యక్ష పదవి నుంచి రాహుల్ గాంధీ తప్పుకున్నారు.. దీంతో మళ్లీ సోనియా గాంధీనే అధ్యక్ష పదవిని చేపట్టాల్సి వచ్చింది. కాగా.. ఈ సారి కాంగ్రెస్ అధ్యక్ష పదవి రాజస్థాన్ సీఎం, గాంధీ కుటుంబానికి వీరవిధేయుడిగా పేరున్న అశోక్ గెహ్లాట్ కు దక్కుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.