Pakistan Economic Crisis: పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. మరికొన్ని రోజుల్లో దివాళా తీసే పరిస్థితి ఏర్పడింది. శ్రీలంక పరిస్థితులు పాకిస్తాన్ లో పునరావృతం కాబోతున్నాయి. కరెంట్ ఆదా చేసేందుకు రాత్రి 8 గంటల తర్వాత మాల్స్, మార్కెట్లు, కళ్యాణ మండపాలను మూసేయాలని అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పెరుగుతున్న అప్పులు, ఇంధన దిగుమతి ఖర్చులు, క్షీణిస్తున్న విదేశీ మారక నిల్వలు, ద్రవ్యోల్భనం, రాజకీయ అస్థిరత, జీడీపీ వృద్ధిలో మందగమనం ఇలా సవాలక్ష సమస్యలు పాకిస్తాన్ ను చుట్టుముట్టాయి.
పిండి, పంచదార, నెయ్యి, ఇలా నిత్యావసరాల ఖర్చులు ఆకాశాన్ని అంటుతున్నాయి. రెండు వారాల్లోనే 15 కిలోల పిండి ధర పాకిస్తాన్ రూ. 300 పెరిగి రూ. 2050కి చేరింది. చెక్కర, నెయ్యి ధరలు 25 శాతం నుంచి 62 శాతానికి పెరిగాయి. దీనికి తోడు ఇంధన కష్టాలు పాక్ పరిస్థితిని దిగజారుస్తున్నాయి. ఇంధన బిల్లలు తగ్గించుకునేందుకు కరెంట్ ను ఆదా చేస్తున్నారు. ఇంధన వినియోగాన్ని 30 శాతం తగ్గించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. దీని వల్ల దేశానికి 274 మిలియన్ డాలర్లు ఆదా అవుతుందని పాక్ ప్రభుత్వం భావిస్తోంది.
Read Also: Rahul Gandhi: మోదీ పాలనలో రెండు భారతదేశాలు ఉన్నాయి..
పాకిస్తాన్ విదేశీ మారక నిల్వలు చాలా వేగంగా క్షీణిస్తున్నాయి. మరోవైపు బెయిల్ అవుల్ ప్యాకేజీ విడతను ఐఎంఎఫ్ ఆలస్యం చేస్తుంది. పాకిస్తాన్ ప్రభుత్వం పన్నులను పెంచకపోవడవంతో ఐఎంఎఫ్ ఇలా చేస్తుంది. ఇప్పటికే ప్రజలు అధిక ధరలతో బాధపడుతున్న తరుణంలో పన్నులు పెంచితే ప్రజల నుంచి ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో అని అక్కడి సర్కార్ భయపడుతోంది. గత ఆర్థిక సంవత్సరం ఆగస్టులో ఐఎంఎఫ్ 3.9 బిలియన్ డాలర్ల బెయిలవుట్ ప్యాకేజీ ఇచ్చింది. సెప్టెంబర్ లో మరో విడత నిధులు రావల్సి ఉన్నా ఐఎంఎఫ్ ఆలస్యం చేస్తోంది.
ఇక అక్టోబర్ నెలలో పాకిస్తాన్ వరదలు ఆ దేశాన్ని మరింత కష్టాల్లోకి నెట్టింది. ఈ వరదల వల్ల 3.3 కోట్ల ప్రజలు బాధపడుతున్నారు. 30 బిలియన్ డాలర్ల మేర నష్టం ఏర్పడింది. వ్యవసాయం దెబ్బతింది. దీంతో పాకిస్తాన్ పూర్తిగా దిగుమతులపై ఆధారపడింది. పాకిస్తాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రకారం, డిసెంబర్ 2022లో దేశ వాణిజ్య లోటు 2.8 బిలియన్ డాలర్లుగా ఉంది. ఎగుమతులు 16 శాతం తగ్గి 2.3 బిలియన్ డాలర్లకు చేరుకుంది. డాలర్ తో పోలిస్తే పాక్ రూపాయి 30 శాతం పతనం అయింది. జూన్ 2023 వరకు 30 బిలియన్ డాలర్ల విదేశీ అప్పును పాకిస్తాన్ చెల్లించాల్సి ఉంది. దేశ జీడీపీ వృద్ధి 2 శాతం మాత్రమే ఉంది. 2021 నాటికి పాకిస్తాన్ మొత్తం విదేశీ రుణం 130.433 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ పరిస్తితుల నేపథ్యంలో పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంతో దివాళా తీయడం ఖాయంగా కనిపిస్తోంది.