pakistan divided into 3 parts: దాయాది దేశం పాకిస్తాన్ పరిస్థితులు విషమిస్తున్నాయి. ఓ వైపు ఆర్థిక సంక్షోభం ముంచుకొస్తుంటే.. మరోవైపు తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్(టీటీపీ), బలూచ్ రిబరేషన్ ఆర్మీ దాడులు చేస్తున్నాయి. దీంతో పాకిస్తాన్ కు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. చాలా మంది చెబుతున్నదాని ప్రకారం మరికొన్ని రోజుల్లో పాకిస్తాన్ మూడు భాగాలు అయ్యే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. గత కొంత కాలం నుంచి పాకిస్తాన్ లో కీలమైన ప్రావిన్సులు అయిన బలూచిస్తాన్, ఖబర్ ఫఖ్తుంఖ్వాలో ఉగ్రవాదులు వరసగా దాడులకు పాల్పడుతున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం కూడా ఏం చేయలేకపోతోంది.
ముఖ్యంగా ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రాంతం ఆఫ్ఘనిస్తాన్ ను ఆనుకుని ఉంటుంది. ఈ ప్రాంతంలో పాకిస్తాన్ తాలిబాన్ల ప్రాబల్యం ఎక్కువ. ఎంతలా అంటే అక్కడి గిరిజన ప్రాంతాల్లో పాకిస్తాన్ చట్టాలకు విలువే లేదు. తాలిబాన్లు చేసిందే చట్టం, చెప్పిందే న్యాయం. ఇక ఆర్థిక పరిస్థితి దిగజారిపోవడంతో ప్రస్తుతం పాకిస్తాన్ ప్రభుత్వం ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. వీరందరికి ఆఫ్ఘన్ తాలిబాన్ల మద్దతు లభిస్తోంది. ఇటీవల పాకిస్తాన్ ఇంటీరియల్ మంత్రి రాణా సనావుల్లా మిలిటరీ యాక్షన్ పై కామెంట్స్ చేశారు. దీనికి ప్రతిగా తాలిబాన్లు 1971లో భారత సైన్యం ముందు లొంగిపోయిన పాకిస్తాన్ ఆర్మీ ఫోటోను షేర్ చేశారు తాలిబాన్లు. మరోసారి మిలిటరీ యాక్షన్ అంటే 1971 సీన్ రిపీట్ అవుతుందని వార్నింగ్ ఇచ్చారు. ఖైబర్ ప్రాంతంలో ఇటీవల భద్రతా బలగాలపై దాడులు అధికం అయ్యాయి. దీనికి తోడు ఆ ప్రాంతంలో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య డ్యూరాండ్ లైన్ వివాదం నడుస్తోంది. ఆఫ్ఘన్ తాలిబాన్లు పాక్ సైన్యానికి చుక్కలు చూపిస్తున్నారు.

Read Also: Siddaramaiah: ప్రధాని ముందు సీఎం, బీజేపీ నేతలు కుక్కపిల్లలు.. ముందు నిలబడేందుకు వణికిపోతారు..
ఇక మరో ప్రావిన్స్ బలూచిస్తాన్ కథ కూడా ఇలాగే ఉంది. పాకిస్తాన్ స్వాతంత్య్రం తరువాత స్వతంత్రంగా ఉన్న బలూచిస్తాన్ ను 1948లో తనలో కలుపుకుంది. అప్పటి నుంచి అక్కడి బలూచ్ ప్రజలు బలూచ్ లిబరేషన్ ఫ్రంట్(బీఎల్ఎఫ్) పేరుతో పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. బలూచిస్తాన్ ప్రాంతంలో తీవ్రమైన మానవహక్కుల ఉల్లంఘనలకు పాల్పడింది పాక్ ప్రభుత్వం. తమకు ఎదురుతిరిగిన వాళ్ల ఆచూకీ లేకుండా చేసింది. ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో బీఎల్ఎఫ్ పాకిస్తాన్ సైనికులు, పోలీసులపై విరుచుకుపడుతోంది. దీంతో పాటు చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్(సీపెక్)లో భాగంగా గ్వాదర్ పోర్టు నిర్మాణంలో చైనీయులు పనిచేస్తున్నారు. వీరిని టార్గెట్ చేసుకుంటూ బీఎఫ్ఎఫ్ దాడులు చేస్తోంది.
ఈ నేపథ్యంలో రానున్న కాలం పాకిస్తాన్ కు గడ్డు పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రాంతాలు విడిపోతాయని.. చివరకు పంజాబ్, సింధ్ ప్రాంతాలతో మాత్రమే పాకిస్తాన్ మిగులుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇక పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న పాక్ ఆక్రమిత కాశ్మీర్, గిల్గిట్-బాల్టిస్తాన్ ను తిరిగి తీసుకోవాలని భారత్ ఎప్పటి నుంచో భావిస్తుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఏ వైపు నుంచి ఏ సమస్య ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి ఉంది. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో ఏ సైనిక చర్య ప్రారంభించినా.. పాకిస్తాన్ లో సంక్షోభం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. మింగలేక, కక్కలేని పరిస్థితుల్లో ఉంది.