Pakistan: ఇటీవల పాకిస్తాన్ వ్యాప్తంగా ఇజ్రాయిల్ వ్యతిరేక నిరసనలు మిన్నంటాయి. ఇజ్రాయిల్-హమాస్ మధ్య ‘‘గాజా శాంతి ఒప్పందం’’ జరుగుతున్న సమయంలోనే పాకిస్తాన్ లో ఇస్లామిస్ట్ అతివాద సంస్థ తెహ్రీక్-ఎ-లబ్బాయిక్ పాకిస్తాన్ (TLP) నిరసనల్లో తీవ్ర హింస చోటు చేసుకుంది. ముఖ్యంగా లాహోర్ నగరం రక్తసిక్తంమైంది. ఇజ్రాయిల్‌కు వ్యతిరేకంగా ఈ సంస్థ కార్యకర్తలు అమెరికా ఎంబసీ ముందు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. వీరిని అడ్డుకునేందుకు పాక్ భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. అనధికారిక లెక్కల ప్రకారం, పాకిస్తాన్ వందలాది మంది ప్రజల్ని పిట్టల్లా కాల్చి చంపింది. పాకిస్తాన్ మాత్రం ఈ అల్లర్లలో ఐదుగురు మరణించినట్లు చెబుతోంది.
నిజానికి తీవ్రవాద భావజాలం ఉన్న ఈ టీఎల్‌పీని పాకిస్తాన్ పెంచి పోషించింది. మతచాంధస వాద సంస్థకు అనేక విధాలుగా పాక్ ఆర్మీ, ప్రభుత్వం అండగా నిలిచింది. ఒక విధంగా చెప్పాలంటే పాముకు పాలు పోసి పెంచింది. అయితే, అది పడగ విప్పి బుసలు కొడుతుందని గ్రహించలేకపోయింది. చివరకు ఈ అల్లర్లతో పాక్‌కి విషయం స్పష్టంగా అర్థమైంది.
తాజాగా, ప్రధాని షెహబాజ్ షరీఫ్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశం తర్వాత తెహ్రీక్-ఎ-లబ్బాయిక్ పాకిస్తాన్ (TLP)ని ఉగ్రవాద వ్యతిరేక చట్టాల కింద నిషేధించింది. ఇటీవల సంవత్సరాల్లో హింసాత్మక నిరసనలకు నాయకత్వం వహించిన ఈ సంస్థను అధికారులు నిషేధించడం ఇది రెండో సారి. టీఎల్పీ ఉగ్రవాదం, హింసాత్మక కార్యకలాపాల్లో పాల్గొంటుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాక్ ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సంస్థ నిరసనలు అమాయక ప్రజలు, భద్రతా సిబ్బంది మరణాలకు దారి తీసినట్లు పేర్కొంది.
Read Also: Tirupati: విషాదం.. నది నీటి ప్రవాహానికి కొట్టుకుపోయిన ఏడుగురు యువకులు..!
అక్టోబర్ 9న పార్టీ చీఫ్ సాద్ రిజ్వీ నేతృత్వంలోని TLP మద్దతుదారులు లాహోర్ నుండి రాజధాని ఇస్లామాబాద్ వైపు ర్యాలీకి ప్లాన్ చేశారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య అమెరికా మధ్యవర్తిత్వంతో జరిగిన కాల్పుల విరమణను నిరసిస్తూ మార్చ్ నిర్వహించడం హింసాత్మకంగా మారింది. మురిడ్కే పట్టణంలో ఘర్షణల్లో ఒక పోలీస్ అధికారితో సహా ఐదుగురు మరణించారు. గతంలో 2021లో ఫ్రాన్స్ వ్యతిరేక నిరసనల్లో అనేక మంది పోలీస్ అధికారులు, పౌరులు మరణించిన సమయంలో ఈ సంస్థపై ఏడు నెలలు నిషేధం విధించారు.
ఈ సంస్థ 2018, 2024 పాక్ ఎన్నికల్లో పోటీ చేసింది. ఎలాంటి సీటు గెలవకున్నా మిలియన్ ఓట్లను సంపాదించుకుంది. పంజాబ్ ఎన్నికల్లో ఒక సీటును 2024లో గెలుచుకుంది. పాకిస్తాన్‌లో దైవ దూషణ చట్టాలను సంస్కరించాలని పిలుపునిచ్చినందుకు 2011లో పంజాబ్ గవర్నర్ సల్మాన్ తసీర్‌ను ముంతాజ్ ఖాద్రీ అనే బాడీగార్డ్ హత్య చేశాడు. ఇతడి మరణ శిక్షను వ్యతిరేకిస్తూ ఈ సంస్థ 2016లో ఏర్పడింది. ఆ సమయంలో చాలా మంది పాకిస్తానీలు ఖాద్రీని ఓ హీరోగా చూడారు. ఈ భావన టీఎల్పీ ఏర్పాటు బీజం పడింది. ఖాదిమ్ హుస్సేన్ రిజ్వీ ఈ అతివాద సంస్థను ఏర్పాటు చేశాడు. ఇప్పుడు దీనికి సాద్ రిజ్వీ నాయకత్వం వహిస్తున్నాడు.