Pakistan: వరస దాడులతో పాకిస్తాన్ కుదేలవుతోంది. బలమైన ఆర్మీ అని పైకి చెప్పుకుంటున్నప్పటికీ పాక్ ఆర్మీ బలం ఇటీవల ఘటనలతో తేలిపోయింది. ముఖ్యంగా బలూచిస్తాన్‌లో బలూచ్ లిబరేషర్ ఆర్మీ(బీఎల్ఏ) దాడులకు, మరోవైపు ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో పాక్ తాలిబాన్ల దాడులకు తట్టుకోలేకపోతోంది. మొన్నటికి మొన్న బలూచిస్తాన్‌లో ట్రైన్ హైజాక్ చేసిన బీఎల్ఏ ఏకంగా 200కి పైగా ఆర్మీ, ఐఎస్ఐ ఆఫీసర్లను చంపేసింది. ఆ తర్వాత భద్రతా బలగాల కాన్వాయ్‌పై జరిగిన దాడిలో 90 మందిని హతమార్చింది.
Read Also: David Warner : ఆ బూతులు వింటే మీరు చెవులు మూసుకుంటారు.. వార్నర్ రియాక్షన్
ఈ నేపథ్యంలో పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌పై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ప్రస్తుతం ఆర్మీ చీఫ్ పదవి నుంచి దిగిపోవాలని జూనియర్ అధికారులు, మాజీ జనరల్స్ హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాకిస్తాన్ ఆర్మీలో తిరుగుబాటు తప్పదా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆసిమ్ మునీర్ సైన్యాన్ని రాజకీయ అణచివేతకు సాధణంగా వాడుకుని ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నట్లు అధికారులు ఆరోపించారు.
నివేదికల ప్రకారం.. కల్నల్స్, మేజర్లు, కెప్టెన్లు, జవాన్లు ఈ మేరకు లేఖ రాసినట్లు తెలుస్తోంది. మునీర్ పాలనలో పాకిస్తాన్ 1971 నాటి పరిస్థితుల్ని ఎదుర్కొంటోందని ఆర్మీ అధికారులు బంగ్లాదేశ్ విభజనను పరోక్షంగా ఉద్దేశిస్తూ లేఖలో పేర్కొన్నారు. మునీర్ వెంటనే రాజీనామా చేయాలని లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించినట్లు తెలుస్తోంది. రాజకీయ అసమ్మతిని అణచివేయడానికి, జర్నలిస్టుల్ని సైలెంట్ చేయడానికి, ప్రజాస్వామ్య శక్తుల్ని అణచివేయడానికి ఉపయోగించి మునీర్ సైన్యం ప్రతిష్టను దిగజార్చారని లేఖలో ఆరోపించారు. ఒక వేళ రాజీనామా చేయకుంటే సైన్యం స్వయంగా చర్య తీసుకుంటుందని లేఖలో హెచ్చరించారు.