పాకిస్థాన్ రాజకీయాల్లో ఏదో జరుగుతోందని సంకేతాలు వెలువడుతున్నాయి. అందుకు పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ నిర్వహించిన సీక్రెట్ మీటింగే ఇందుకు ఉదాహరణగా తెలుస్తోంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను పూర్తిగా అధికారానికి దూరంగా ఉంచేలా సరికొత్త ప్రణాళికలు జరుగుతున్నట్లుగా సమాచారం. అందుకోసం షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వంతో అసిమ్ మునీర్ తన పట్టును బిగించుకోవాలని.. అలాగే బంధాన్ని మరింతగా పెంచుకోవాలని యోచిస్తున్నట్లు తాజా ఎత్తుగడలను బట్టి అర్థమవుతోంది.
ఇది కూడా చదవండి: Bihar Elections: త్వరలోనే బీహార్ ఎన్నికల షెడ్యూల్.. ఎన్నికలు ఎప్పుడంటే..!
పాక్ ఆర్మీ చీఫ్‌గా ఉన్న మునీర్.. ఫీల్డ్ మార్షల్‌గా పదోన్నతి పొందాడు. ప్రస్తుతం మునీర్ పదవీకాలం రెండు నెలల్లో.. అనగా నవంబర్ 28, 2025తో ముగుస్తోంది. కానీ 2030 వరకు ఆర్మీ చీఫ్‌గా మునీరే కొనసాగేలా కసరత్తు జరుగుతోంది. 2022లో మూడేళ్ల పదవీకాలానికి మునీర్ నియమింపబడ్డాడు. తాజాగా మరో ఐదేళ్ల పదవీ కాలాన్ని పొడిగించేలా ప్లానింగ్ నడుస్తోంది. 1952 పాకిస్థాన్ ఆర్మీ చట్టానికి చేసిన సవరణల ప్రకారం.. మరో ఐదేళ్ల పొడిగింపు పొందే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి. ఖమర్ జావేద్ బజ్వా కూడా 2019లో మూడేళ్ల పొడిగింపు పొందాడు. ఆరు సంవత్సరాల పాటు ఆర్మీ చీఫ్‌గా పని చేశాడు. ఇప్పుడు ఇదే కోవలో మునీర్‌ను కూడా కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఇది కూడా చదవండి: UP: భార్యాభర్తల మధ్య ఘర్షణ.. బిల్డింగ్‌పైకి ఎక్కి భార్య ఏం చేసిందంటే..!
ఇందుకోసం ముర్రీలోని మాజీ ప్రధాని, పీఎంఎల్-ఎన్ అధినేత నవాజ్ షరీఫ్ ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లో జరిగిన క్లోజ్డ్ డోర్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వర్గాలు తెలిపాయి. ఈ సమావేశానికి ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్, పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్, ఐఎస్ఐ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ మాలిక్ హాజరయ్యారు. ఈ సమావేశంలో దేశంలో స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి మరో పదేళ్ల పాటు వ్యవస్థ కొనసాగింపు ప్రణాళికపై ఏకాభిప్రాయం కుదిరినట్లుగా తెలుస్తోంది. ఒకవేళ అదే జరిగితే మాత్రం ఇమ్రాన్‌ఖాన్ పూర్తిగా జైల్లోనే మగ్గాల్సి ఉంటుంది. వాస్తవంగా పాకిస్థాన్ ప్రధానులందరూ కూడా సైనిక అధిపతి ఆశీర్వాదంతోనే ఎన్నికయ్యారు. విచిత్రమేంటంటే ఏ ప్రధాని కూడా పూర్తి కాలం పదవిలో కొనసాగలేదు. తాజా పరిణామాలను బట్టి చూస్తుంటే.. పాకిస్థాన్‌లో తీవ్రమైన కుట్ర ఏదో జరుగుతుందనే విషయం అర్థమవుతోంది. అసిమ్ మునీర్ ఆర్మీ చీఫ్‌గా ఉంటే తమకేమీ ఢోకా ఉండదని భావిస్తున్నట్లు వినికిడి.

ఇక మునీర్ పున:నియామకానికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉంది. అందుకు సంబంధించిన చట్టపరమైన అంశాలను పరిశీలిస్తున్నట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇక మీటింగ్‌లో ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్‌లోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఐఎస్ఐ, డిజి మిలిటరీ ఇంటెలిజెన్స్, డిజి-సి (కౌంటర్ ఇంటెలిజెన్స్) వంటి కీలక పదవులను సంయుక్తంగా భర్తీ చేయనున్నట్లు కూడా తెలుస్తోంది. ఇక జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్న డీజీ ఐఎస్ఐ లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ మాలిక్ పదవీకాలం కూడా అక్టోబర్‌లో ముగియనుంది. ఇతని పదవి కూడా కొనసాగించేందుకు పరిశీలిస్తున్నట్లు అంతర్గత వర్గాలు తెలిపాయి. ఇక జైల్లో ఉన్న ఇమ్రాన్‌ఖాన్ గురించి కూడా చర్చించినట్లు సమాచారం. మరిన్ని రోజులు జైల్లోనే ఉంటాడని చర్చించినట్లు తెలుస్తోంది.

అసిమ్ మునీర్.. ఇతడు రెచ్చగొట్టిన తర్వాతే పహల్గామ్ ఉగ్రదాడి జరిగింది. ఇక ట్రంప్ ఆహ్వానం మేరకు అమెరికాకు వెళ్లాడు. వైట్‌హౌస్‌లో ప్రత్యేక విందు కూడా ఏర్పాటు చేశారు. రెండు గంటల పాటు మునీర్‌తో ట్రంప్ చర్చలు జరిపారు. ఇక ఐదు రోజుల పర్యటనలో భాగంగా భారత్‌పై నీచ వ్యాఖ్యలు చేశాడు. భారత్‌ను కారుతో పోల్చగా.. పాకిస్థాన్‌ను డంప్ ట్రక్కుతో పోల్చాడు. అంతేకాకుండా ప్రధాని షెహబాజ్‌తో కలిసి అనేక దేశాలు కూడా మునీర్ చుట్టి వచ్చాడు. మునీర్ ప్రభుత్వంతో బంధాన్ని బలపరుచుకుని సరికొత్త ఎత్తుగడకు ప్రణాళికలు రచిస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.