Pak-Afghan: ఆఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్ మధ్య టర్కీలో జరుగుతున్న శాంతి చర్చలు విఫలమయ్యాయి. దీంతో రెండు దేశాలు మరోసారి యుద్ధానికి దగ్గరగా చేరాయి. చర్చలు విఫలమైనట్లు ఇరు దేశాలు స్టేట్ మీడియా వెల్లడించింది. చర్చలు విఫలమైతే ఆఫ్ఘాన్‌పై దాడులు చేయడం తప్పా వేరే మార్గం లేదని ఇటీవల పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు. చర్చల గురించి పాకిస్తాన్ మాట్లాడుతూ.. ‘‘ఆఫ్ఘాన్ తార్కిక, చట్టబద్ధమైన డిమాండ్’’ల అంగీకరించకపోవడం వల్లే ప్రతిష్టంభన ఏర్పడినట్లు చెప్పింది. తమకు వ్యతిరేకంగా ఆఫ్ఘాన్ గడ్డను వాడకూడదని పాకిస్తాన్ కోరింది.
Read Also: India – China: డ్రాగన్ దేశానికి నిద్రలేని రాత్రులను గిఫ్ట్‌గా ఇచ్చిన భారత్..
చర్చలు విఫలమైతే యుద్ధం తప్పదని పాక్ రక్షణ మంత్రి ఆసిఫ్ వ్యాఖ్యలు ఇప్పుడు కీలకంగా మారాయి. పాక్, ఆఫ్ఘాన్ యుద్ధానికి మళ్లీ సన్నద్ధం అవుతాయా అనే సందేహాలు వినిపిస్తున్నాయి. మరోవైపు, చర్చలు విఫలమైనప్పటీకి ఇరు దేశాల బృందాలు ఇంకా టర్కీలోనే ఉన్నాయి. నాలుగో రౌండ్ చర్చల గురించి ఇంకా సమాచారం లేదు. ఖతార్, టర్కీ మధ్యవర్తిత్వంతో మొదటి రౌండ్ చర్చలు దోహాలో జరిగాయి.
అక్టోబర్ ప్రారంభంలో తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీ వారం రోజుల పాటు ఢిల్లీలో పర్యటించారు. భారత్-ఆఫ్ఘాన్ సంబంధాలు మెరుగవుతున్న తరుణంలోనే, పాకిస్తాన్ కాబూల్‌పై వైమానిక దాడులకు పాల్పడింది. ఆ తర్వాత రెండు దేశాల సరిహద్దుల్లో ఘర్షణ మొదలైంది. ఇరు వైపుల పదుల సంఖ్యలో మరణాలు చోటు చేసుకున్నాయి.
