ఉత్తర కొరియా ఓ రహస్య దేశం. ప్రపంచంలో ఏం జరుగుతుందో నార్త్ కొరియా ప్రజలకు… నార్త్ కొరియాలో ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియడం చాలా తక్కువ. అక్కడ కిమ్ జోంగ్ ఉన్ చెప్పిందే వేదం, చేసిందే చట్టం. వింతవింత రూల్స్, చిత్ర విచిత్రంగా ఉండే దేశం ఉత్తర కొరియా. ఇదిలా ఉంటే ఇప్పుడు అలాంటి దేశాన్ని కరోనా భయపెడుతోంది. కిమ్ రాజ్యంలో కోవిడ్ -19 తీవ్రంగా విజృంభిస్తోంది. ఎంతలా అంటే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఈ కరోనా వ్యాప్తిని గొప్ప తిరుగుబాటుగా అభివర్ణించారంటే అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. గత రెండేళ్లుగా కరోనా బారినుంచి తప్పించుకుంటున్న నార్త్ కొరియాను ప్రస్తుతం కరోనా ఒమిక్రాన్ వేరియంట్ తో వణుకుతోంది.
ఇటీవల మూడు రోజుల క్రితం కొరియాలో కరోనా కేసు నమోదు అవ్వడంతో… కిమ్ నేషనల్ ఎమర్జెన్సీని విధించారు. ఆ దేశంలో రోజు రోజుకు కరోనా సంబంధిత లక్షణాలు, జ్వరాలతో చనిపోతున్న వారి సంఖ్య ఎక్కువ అవుతోంది. మూడు రోజుల నుంచి వరసగా మరణాలు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు కొరియాలో జ్వరం బారిన పడి 42 మంది మరణించారు. వరసగా గడిచిన మూడు రోజుల్లో 6, 21, 15 మంది చనిపోయినట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ(కేసీఎన్ఏ) అధికారికంగా వెల్లడించింది.
నార్త్ కొరియాలో ఒకే రోజు 2,96,180 మంది ఫ్లూ లక్షణాలతో బాధపడుతున్న వారు బయటపడగా….మొత్తంగా కరోనా అనుమానిత కేసుల సంఖ్య 8,20,620కు చేరింది. దేశం మొత్తం లాక్ డౌన్ విధించారు అధ్యక్షుడు కిమ్. దేశవ్యాప్తంగా వాణిజ్య సముదాయాలు, సంస్థలు మూతపడ్డాయి. అయితే ఇతర దేశాల నుంచి సహాయం తీసుకోకపోతే ఉత్తర కొరియా పెనువిపత్తును తట్టుకోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైద్యసామాగ్రి, వ్యాక్సిన్లు, మెడిసిన్స్ ఇతర దేశాల నుంచి తీసుకోకపోతే కొరియాలో మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.