North Korea fired at least 10 missiles of various types on Wednesday: ఉత్తర కొరియా మరోసారి క్షిపణి ప్రయోగాలను జరిపింది. బుధవారం రోజున ఏకంగా 10 క్షిపణులను ప్రయోగించింది. దీంతో దక్షిణ కొరియా అలెర్ట్ ప్రకటించింది. తమ ప్రజలు బంకర్లలోకి వెళ్లాలని సూచించింది. బాలిస్టిక్ క్షిపణి దక్షిణ కొరియా జాలాలకు దగ్గర్లో పడినట్లు దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది. దీన్ని కవ్వింపు చర్యగా దక్షిణ కొరియా అభివర్ణించింది. మరోవైపు రెండు దేశాల వివాదాస్పద సముద్ర సరిహద్దు అయిని నార్తర్న్ లిమిట్ లైన్ కు దక్షిణంగా అంతర్జాతీయ జాలాల్లో మరో క్షిపణి పడినట్లు దక్షిణ కొరియా వెల్లడించింది. ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలపై దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ జాతీయ భద్రత మండలి సమావేశానికి పిలుపునిచ్చారు. ఈ ఏడాది ఉత్తరకొరియా జరిపిన క్షిపణి ప్రయోగాల్లో ఇదే అత్యంత తీవ్రమైనదిగా నిపుణులు చెబుతున్నారు.
Read Also: JR.NTR : జూనియర్ ఎన్టీఆర్ పై ప్రశంసల జల్లు.. సింప్లిసిటీకి ఫిదా అవుతున్న అభిమానులు
మరోవైపు జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా కూడా ఉత్తర కొరియా చర్యను తప్పపట్టారు. దక్షిణ కొరియా తన మిత్ర దేశం అమెరికాతో కలిసి సైనిక విన్యాసాలు చేస్తున్న నేపథ్యంలో ఉత్తర కొరియా వరసగా క్షిపణి ప్రయోగాలను చేపడుతోంది. ఈ సైనిక విన్యాసాల గురించి హెచ్చరిస్తూ.. అమెరికా, దక్షిణ కొరియాలు చరిత్రలో అత్యంత భయంకరమై మూల్యం చెల్లించడానికి అణ్వాయుధాలను ఉపయోగిస్తామని ఉత్తర కొరియా హెచ్చరించిన గంటల వ్యవధిలోనే ఈ క్షిపణి ప్రయోగాలు జరిగాయి. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కు అత్యంత సన్నిహితుడైన వర్కర్స్ పార్టీ కార్యదర్శి పాక్ జోంగ్ చోన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా-దక్షిణ కొరియా చేస్తున్న సైనిక విన్యాసాలు రెచ్చగొట్టేవిగా ఆయన అభివర్ణించారు.
అయితే ఉత్తర కొరియా చేస్తున్న ఈ వ్యాఖ్యల్ని అమెరికా ఖండించింది. ఉత్తర కొరియా పట్ల మాకు ఎలాంటి శత్రుత్వం లేదని స్పష్టం చేసింది అమెరికా. సమస్యలను దౌత్యమార్గాల్లో పరిష్కరించుకోవాలని సూచించింది. ఈ ఏడాది ఇప్పటి వరకు ఉత్తర కొరియా 40 కంటే ఎక్కువ బాలిస్టిక్ మిస్సైళ్లను ప్రయోగించింది. వీటిలో చాలా వరకు క్షిపణులు జపాన్ మీదుగా ప్రయాణించి సముద్రంలో పడ్డాయి.