అమెరికాపై ఉత్తర కొరియా కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఉక్రెయిన్‌లో నెలకొన్న పరిస్థితులకు అమెరికానే కారణం అని కిమ్ జోంగ్ ఉన్ పేర్కొన్నారు. ఈ మేరకు ఉత్తర కొరియా విదేశాంగ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. భద్రత విషయంలో రష్యా చట్టపరమైన డిమాండ్‌ను అమెరికా పట్టించుకోలేదని, అగ్రరాజ్యం సైనిక అధిపత్యాన్ని అనుసరించిందని ఉత్తర కొరియా పేర్కొన్నది. నార్త్ సొసైటీ ఫర్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ స్టడీ లో పరిశోధకుడైన రి జి సాంగ్ చేసిన వ్యాఖ్యలను ఉత్తర కొరియా తన విదేశాంగ శాఖ వెబ్ సైట్‌లో పోస్ట్ చేసింది.
Read: Women Farmers: మనల్ని పోషించే చేతులు
అమెరికా అధికంగా జోక్యం చేసుకోవడమే ఉక్రెయిన్ సంక్షోభానికి ముఖ్య కారణం అని, అమెరికా ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తోందని ఆ దేశం మండిపడింది. అమెరికా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని విమర్శించింది. శాంతి, స్థిరత్వం పేరిట ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకుంటోందని, తమ జాతీయ భద్రత కోసం ఇతర దేశాలు తీసుకున్న స్వీయ రక్షణ చర్యలను అమెరికా మోకాలడ్డేస్తోందని మండిపడింది. ఒకప్పుడు అమెరికాను సుప్రీం లీడర్‌గా చూసేవారని, కాని ఇప్పుడు ఆ రోజులు పోయాయని, అన్ని దేశాలు అన్ని రంగాల్లో అభివృద్ది సాధిస్తున్నాయని ఉత్తర కొరియా పేర్కొన్నది.