ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో రాజకీయ పరిణామాలు కూడా వేగంగా మారిపోయాయి.. అధ్యక్షుడిగా ఉన్న గొటబాయ రాజపక్స దేశం విడిచిపారిపోవడం.. ఆ తర్వాత రాజీనామా చేయడంతో.. కొత్త అధ్యక్షుడి ఎన్నిక అనివార్యం అయ్యింది.. ఈ నేపథ్యంలో దేశంలో ఆందోళనలు, హింస తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యగా అత్యవసర పరిస్థితి ప్రకటించారు.. నిన్నటి నుంచే శ్రీలంకలో అత్యవసర పరిస్థితి అమల్లోకి వచ్చింది.. ఇక, రేపు అనగా ఈ నెల 20వ తేదీన కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు పార్లమెంట్ సభ్యులు.. అయితే, అధ్యక్ష రేసులో ప్రముఖంగా నలుగురి పేర్లు వినిపిస్తున్నాయి..
ఇవాళ శ్రీలంకా కొత్త అధ్యక్షుడు ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుండగా.. తాత్కాలిక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, ఎస్‌ఎల్‌పీపీ చీలిక వర్గ నేత అయిన దుల్లాస్ అలహప్పేరుమ, ఎస్‌జేబీ నేత సాజిత్ ప్రేమదాస, మాజీ సైన్యాధిపతి ఫీల్డ్‌మార్షల్ శరత్ ఫొన్సెకా నామినేషన్లు దాఖలు చేయడానికి సిద్ధం అయ్యారు. ఈ ఎన్నికలతో ప్రజలకు సంబంధం లేదు.. ప్రజాతీర్పు ద్వారా కాకుండా పార్లమెంటు సభ్యులు శ్రీలంక దేశాధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు.. ఆ దేశంలో 1978 తర్వాత ఈ పరిస్థితి రెండోసారి వచ్చింది.. మొత్తంగా.. రేపు రహస్య ఓటింగ్ విధానంలో ఎంపీలు తమ దేశాధినేతను ఎన్నుకోనున్నారు.. అధ్యక్షుడిగా ఎన్నికయ్యే వ్యక్తి.. 2024 నవంబర్ వరకు అధికారంలో ఉండనున్నారు.. ప్రస్తుతం శ్రీలంక పార్లమెంటులో మొత్తం 225 మంది సభ్యులు ఉన్నారు.. ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న సమయంలో.. అధ్యక్షుడిగా ఎంపీలు ఎవరికి అవకాశం ఇస్తారు అనేది ఆసక్తికంగా మారింది.. కాగా, 1982, 1988, 1994, 1999, 2005, 2010, 2015, 2019లో అధ్యక్ష ఎన్నికల్లో ఓటువేశారు ప్రజలు.. ఇప్పుడు మాత్రం ఎంపీలే ఓటు వేసి అధ్యక్షుడిని ఎన్నుకోబోతున్నారు.