Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ను అక్కడి ప్రభుత్వం ‘తోషాఖానా కేసు’లో అరెస్ట్ చేసి జైలుకు తరలించింది. ఇదిలా ఉంటే జైలులో ఉన్నా ఇమ్రాన్ ఖాన్ సకల సదుపాయాలను అనుభవిస్తున్నారు. ప్రత్యేకమైన సూట్ లా ఫీల్ అవుతున్నారు.
తేనె, ఎయిర్ కూలర్, పెర్ప్యూమ్, మంచం, దిండు, పరుపు, కుర్చీ, ఖురాన్, ఖర్జూరాలు, టిష్యూ పేపర్, కొత్తగా వెస్ట్రన్ టాయిలెట్, వాష్ బేషన్ సౌకర్యాలను కల్పించారు జైలు అధికారులు. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ పంజాబ్ ప్రావిన్స్ లోని అటాక్ జిల్లా జైలులో మూడేళ్ల శిక్ష అనుభవిస్తున్నారు. ఇటీవల పంజాబ్ జైళ్ల ఐజీ మియాన్ ఫరూక్ అటాక్ జైలును సందర్శించి ఇమ్రాన్ ఖాన్ కు అందిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు.
మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు వైద్య సదుపాయాలు అందించేందుకు ఐదుగురు డాక్టర్లు, ఒక్కొక్కరు ఎనిమిది గంటల పాటు పనిచేస్తున్నారు. ఆయనకు ప్రత్యేకంగా ఆహారాన్ని అందిస్తున్నారు. వైద్యులు పరీక్షించిన తర్వాతే ఆయనకు ఆహారాన్ని అందిస్తున్నారు. ఆయన శ్రేయస్సు, భద్రత గురించి భార్య, పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేసిన క్రమంలో అదనపు సౌకర్యాలు అందిస్తున్నారు.
Read Also: Bomb Threat: కొచ్చి-బెంగళూర్ విమానానికి బాంబ్ బెదిరింపు..
అంతకుముందు ఆయనపై విష ప్రయోగం చేసే అవకాశం ఉందని ఆయన పార్టీ నేతలు, భార్య బుష్రా బీబీ అనుమానం వ్యక్తం చేశారు. శుక్రవారం ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అటాక్ జైలు నుంచి రావల్సిండి జైలుకు ఆయనను తరలించాలని బుష్రా బీబీ ప్రభుత్వాన్ని కోరారు.
ఆగస్టు 5న ఇస్లామాబాద్ ట్రయల్ కోర్టు తోషాఖానా కేసులు ఇమ్రాన్ ఖాన్ ను దోషిగా నిర్థారించింది. తీర్పు వచ్చిన కొద్ది సేపటికే లాహోర్ లో ఆయన్ను అరెస్ట్ చేశారు. 2018-22 కాలంలో ప్రధానిగా ఉన్న సమయంలో ఇమ్రాన్ ఖాన్, ఆయన కుటుంబం సంపాదించిన దేశ బహుమతులను చట్టవిరుద్ధంగా విక్రయించారనే ఆరోపణలపై కోర్టు శిక్ష విధించింది. ఐదేళ్లు రాజకీయ నుంచి ఇమ్రాన్ ఖాన్ ను నిషేధించారు.