ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కుమారుడి పెళ్లి గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శల పాలయ్యాయి. ఇరాన్‌తో యుద్ధం కారణంగా రెండోసారి తన కుమారుడి పెళ్లి వాయిదా వేయాల్సి వచ్చిందని.. ఇది వ్యక్తిగత నష్టంగా అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలే సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కొద్దిరోజులుగా ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం సాగుతోంది. అయితే గురువారం ఇరాన్ ప్రయోగించిన క్షిపణి కారణంగా ఇజ్రాయెల్‌లోని బీర్ షెవాలోని సోరోకా ఆస్పత్రి ధ్వంసమైంది. ఈ ఆస్పత్రిని నెతన్యాహు పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కుమారుడి పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చి.. యుద్ధం కారణంగా తన కుమారుడు అవర్న్ వివాహాన్ని వాయిదా వేయల్సి వస్తోందని.. అంతేకాకుండా అవర్న్‌కు కాబోయే భార్య కూడా తీవ్ర నిరాశకు గురవుతుందని.. ఇక తన భార్య సారా నెతన్యాహు అయితే ఇంకా తీవ్రంగా బాధపడుతుందని.. నిజంగా ఆమె హీరో అంటూ నెతన్యాహు ప్రశంసలు కురిపించారు. యుద్ధం కారణంగా తన కుటుంబమంతా వ్యక్తిగతంగా భారీ నష్టాన్ని ఎదుర్కొంటోందని… తన కుటుంబం చేస్తున్న త్యాగం చాలా గొప్పదంటూ వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Human Trafficking : ఆధార్ కార్డు హింట్‌తో మానవ రవాణా ముఠా గుట్టురట్టు
ఈ వ్యాఖ్యలే తీవ్ర దుమారం రేపుతున్నాయి. నెతన్యాహు చేసిన వ్యాఖ్యలతో ఇజ్రాయెల్ ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. యుద్ధం నుంచి నెతన్యాహు భావోద్వేగం వైపునకు నడిపిస్తున్నారని.. ప్రజల బాధల కంటే సొంత ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నాంటూ నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక 2023, అక్టోబర్ నుంచి హమాస్ చెరలో బందీగా ఉన్నవారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 622 రోజులుగా గాజాలోని నరకపు చెరసాలలో ఉన్నానని.. మా బాధలు పట్టవా? అంటూ అంగ్రెస్ట్ అనే బందీ ఎక్స్ ట్విట్టర్‌లో ఆగ్రహం వ్యక్తం చేశాడు. రాత్రి షిఫ్ట్‌ల కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లే వైద్యులే హీరోలని.. పిల్లలకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులే హీరోలని.. అంతేకాని నెతన్యాహు భార్య హీరో కాదంటూ కరీవ్ అనే మరో నెటిజన్ విమర్శించారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా సోషల్ మీడియాలో నెతన్యాహుపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Illegal Affair : ప్రియుడి మోజు.. నాలుగు ప్రాణాలు తీసిన విషాదం..!
గత శుక్రవారం నుంచి ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకరమైన యుద్ధం సాగుతోంది. ఇరాన్‌లో ఇప్పటి వరకు 300 మందికిపైగా చనిపోగా.. ఇజ్రాయెల్‌లో కూడా 28 మంది వరకు చనిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రెండు దేశాలు పోటాపోటీగా క్షిపణులు ప్రయోగించుకుంటున్నాయి.