Nearly 250 million Covid-19 infections in China in just 20 days: ప్రపంచం ఎప్పుడూ చూడని వివత్తును ఎదుర్కొంటోంది డ్రాగన్ కంట్రీ చైనా. కోవిడ్ ఉప్పెనలా చైనాపై విరుచుకుపడుతోంది. ఒమిక్రాన్ బీఎఫ్-7 వేరియంట్ విజృంభించడంతో కరోనా బారిన పడే ప్రజల సంఖ్య పెరుగుతోంది. దీంతో రాజధాని బీజింగ్ తో పాటు షెన్ జెన్, చాంగ్ కింగ్, వాణిజ్య రాజధాని షాంఘైలో కేసుల సంఖ్య పెరిగాయి. ప్రధాన నగరాల్లో కోవిడ్ రోగులతో ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. ‘‘జీరో కోవిడ్’’ విధానాన్ని ఎత్తేయడంతో కేసుల సంఖ్య పెరిగింది. ఇదిలా ఉంటే పలు అంతర్జాతీయ సంస్థలు రాబోయే రోజుల్లో చైనా ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్ దాడిని ఎదుర్కోబోతోందని చెబుతున్నాయి.
తాజాగా చైనా నుంచి లీక్ అయిన ఓ డాక్యుమెంట్ చైనాలో కరోనా పరిస్థితిని వివరిస్తోంది. డిసెంబర్1 నుంచి 20 మధ్య దాదాపుగా 24.8 కోట్ల మంది ప్రజలు కోవిడ్ బారిన పడినట్లు వివరిస్తోంది. చైనా ప్రభుత్వానికి చెందిన ఈ డాక్యుమెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దాదాపుగా 25 కోట్లు అంటే చైనా జనాభాలో 17.65 శాతం మంది. జీరో కోవిడ్ పాలసీని ఈ నెల మొదటివారంలో చైనా ఎత్తేసింది. తర్వాత 20 రోజుల్లోనే ఈ స్థాయిలో ప్రజలు కోవిడ్ బారిన పడినట్లు తెలుస్తోంది.
Read Also: Veera Simha Reddy: ఈ ఒక్క పాటతో తమన్ కి ఫుల్ బిర్యానీ పెట్టేయొచ్చు…
చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ 20 నిమిషాల సమావేశం నుంచి ఈ డాక్యుమెంట్ లీకైనట్లు తెలుస్తోంది. అయితే చైనా అధికారులు అంచనా వేస్తున్నట్లు కేసుల సంఖ్య మరింతగా ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. అయితే లీక్ అయిన డాక్యుమెంట్ వాస్తవమే అని.. సమావేశానికి హాజరైన వ్యక్తి ఈ డేటాను లీక్ చేశారని చైనా సీనియర్ జర్నలిస్టు ఒకరు గురువారం రేడియో ఫ్రీ ఏషియాతో అన్నారు. ఇదిలా ఉంటే వచ్చే వారం చైనాలో ఏకంగా ఒకే రోజు 3.7 కోట్ల మంది ప్రజలు కోవిడ్ బారిన పడవచ్చని అక్కడి అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇదిలా ఉంటే చైనాలో పరిస్థితులు వల్ల అక్కడ మందులకు కూడా కొరత ఏర్పడింది. జనాలు కోవిడ్ నుంచి నయం అయ్యేందుకు సంప్రదాయ చైనా వైద్యాన్ని నమ్ముకుంటున్నారు. నిమ్మకాయలకు చైనా వ్యాప్తంగా భారీ గిరాకీ ఏర్పడింది. ఇదిలా ఉంటే జనాలు తక్కువ ఇమ్యూనిటీ వల్ల పిట్టల్లా రాలిపోతున్నారు. మరోవైపు చైనా కరోనా వ్యాక్సిన్ పనిచేయడం లేదని అంతర్జాతీయంగా ఆరోపణలను మూటగట్టుకుంటుంది.