ఆప్ఘనిస్థాన్‌ను పూర్తిస్థాయిలో తమ ఆధీనంలోకి తీసుకున్నామని ప్రకటించిన తాలిబన్లు.. ఇక, ప్రభుత్వ ఏర్పాటుపై దృష్టిపెట్టారు.. ఆ దేశ రాజధాని కాబూల్‌ను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచే ఈ చర్చ సాగుతోంది.. తాజాగా.. తాలిబన్లకు కొరకరాని కొయ్యగా ఉన్న పంజ్‌షీర్‌ను సైతం తమ ఆధీనంలోకి తెచ్చుకున్నట్టు ప్రకటించారు. ఇక, తాలిబాన్ల ప్రభుత్వ అధినేతగా ముల్లా మహమ్మద్ హసన్ అఖుంద్ పేరు ఖరారైనట్టు పాకిస్థాన్ మీడియా పేర్కొంటోంది… తాలిబాన్ల అత్యున్నత నిర్ణయక మండలి అయిన ‘రెహబరీ షురా’ దీనిపై నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.. హసన్ ప్రస్తుతం ‘రెహబరీ షురా’ కమిటీలో కీలక బాధ్యతలు పోషిస్తున్నారు.. దాదాపు 20 సంవత్సరాలుగా రెహబరీ షురా అధినేతగా కొనసాగుతున్నారు.
మరోవైపు 1996లో ఏర్పడిన తాలిబాన్ సర్కార్‌లో ఆయన కీలక బాధ్యతలు చేపట్టారు.. డిప్యూటీ ప్రధానిగా, విదేశాంగ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.. దీంతో.. రెహబరీ షురా.. ఆయనకే పట్టం కట్టినట్టు పాక్ మీడియా పేర్కొంది. ఇక డిప్యూటీలుగా ముల్లా అబ్దుల్ ఘనీ బరాదార్, ముల్లా అబ్దుల్ సలామ్ పేర్లు కూడా ఖరారైనట్టు చెబుతున్నారు.. తాలిబాన్ వ్యవస్థాపకుడు ముల్లా ఉమర్ కుమారుడు ముల్లా యాఖూబ్‌కు రక్షణ శాఖ అప్పగించేందుకు నిర్ణయించినట్టు తెలుస్తోంది.. హోంశాఖ మంత్రిగా సిరాజుద్దీన్ హక్కానీని నియమించనుండగా.. విదేశాంగ మంత్రిగా అమీర్ ఖాన్ ముత్తకీ పేరు ఖరారైనట్టు పాక్ మీడియా పేర్కొంది.. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సిఉంది.. వచ్చే వారం అధికారికంగా వారి పేర్లను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.