కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కలవరపెడుతూనే ఉంది. తాజాగా మంకీపాక్స్ రూపంలో మరో వైరస్ ప్రపంచంలో చాపకింద నీరులా విస్తరిస్తోంది. మే మొదటి వారంలో బ్రిటన్ లో బయటపడిన ఈ వైరస్ నెమ్మదిగా యూరప్ దేశాలతో పాటు అమెరికా, మిడిల్ ఈస్ట్ దేశాలకు విస్తరిస్తోంది. తాజాగా అమెరికాలో కేసుల సంఖ్య పెరుగుతోంది.
ఇన్నాళ్లు యూరప్ ప్రాంతానికే పరిమితం అయిన మంకీపాక్స్ వైరస్ కేసులు అమెరికాలో కూడా పెరుగుతున్నాయి. మే 18న అమెరికాలో తొలికేసును గుర్తించారు. ప్రస్తుతం యూఎస్ఏలో ఏడు రాష్ట్రాల్లో మొత్తం 9 మంకీపాక్స్ కేసులను గుర్తించారు. కాలిఫోర్నియా, ఫ్లోరిడా, మసాచుసెట్స్, న్యూయార్క్, ఉటా, వర్జీనియా, వాషింగ్టన్ రాష్ట్రాల్లో కేసులను గుర్తించారు. కాగా ఈ తొమ్మిది మంది కూడా ఇటీవల వివిధ దేశాలకు వెళ్లి వచ్చినట్లు అక్కడి అధికారులు ధ్రువీకరించారు. రాబోయే రోజుల్లో అమెరికాలో మరిన్ని కేేసులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతం ప్రపంచంలోని 20 దేశాల్లో 200పైగా కేసులను ధ్రువీకరించగా… మరో 100 మంది అనుమానిత కేసులు బయటపడ్డాయి. ఆఫ్రికా దేశాలైన కామోరూన్, కాంగో, నైజీరియా, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ దేశాల్లో సాధారణంగా కనిపించే మంకీపాక్స్ ప్రస్తుతం బ్రిటన్, స్పెయిన్, నెదర్లాండ్స్, జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, యూఎస్ఏ, చెక్ రిపబ్లక్, యూఏఈ, ఇజ్రాయిల్ వంటి దేశాల్లో బయటపడింది.
ఇదిలా ఉంటే ఇండియా కూడా మంకీపాక్స్ కేసులపై అప్రమత్తం అయింది. ఇప్పటికే కేరళ వంటి రాష్ట్రాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. భారత ప్రభుత్వం కూడా త్వరలోనే మంకీపాక్స్ సంబంధించి గైడ్ లైన్స్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. మంకీపాక్స్ ఎఫెక్టెడ్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై కన్నేసి ఉంచాలని.. అనారోగ్యంతో ఉన్నవారి శాంపిళ్లను నేషనల్ ఇస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, పుణేకు పంపాలని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఆదేశాలను జారీ చేసింది.