Mohsen Fakhrizadeh: ఇజ్రాయిల్ ఆపరేషన్ ఎలా ఉంటాయో చూడాలంటే, తాజాగా ఇరాన్ దాడులే నిదర్శనం. అత్యంత ఖచ్చితత్వంతో దాడులు నిర్వహిస్తోంది. ఇరాన్ అణు శాస్త్రవేత్తల్ని వారి బెడ్రూంలోకి దూరి మరీ చంపేస్తోంది. వీరిలో పాటు కీలకమైన మిలిటరీ జనరల్స్‌ని అత్యంత ఖచ్చితత్వంతో హతమార్చింది. ఇజ్రాయిల్ గూఢచార సంస్థ మొసాద్ ఈ ఆపరేషన్స్ నిర్వహిస్తుందని ఇరాన్ ఆరోపిస్తోంది. అయితే, ఇంత ఖచ్చితత్వంతో ఎలా దాడులు జరుగుతున్నాయో తెలియక భయపడటం ఇరాన్ వంతవుతోంది. తాజాగా జరిగిన దాడుల్లో ఇరాన్ అణుశక్తి సంస్థ మాజీ అధిపతి ఫెరీడౌన్ అబ్బాసీని కూడా హతమార్చింది. ఒకానొక సమయంతో తన హత్య గురించి నవ్వుతూ మాట్లాడుతూ.. సంతోషంగా అణ్వాయుధాలను నిర్మిస్తాను అని చెప్పిన వ్యక్తిని ఇప్పుడు ఇజ్రాయిల్ హతం చేసింది. 2010లో జరిగిన టార్గెటెడ్ దాడి నుంచి తప్పించుకున్న అబ్బాసీ ఇప్పుడు మాత్రం బయటపడలేదు.
ఈ దాడులకు ముందే అంటే 2015లో ఇజ్రాయిల్, ఇరాన్ ‘‘అణు పితామహుడి’’గా పిలిచే మొహ్సేద్ ఫఖ్రిజాదేహ్‌ని చంపేసింది. ఇప్పటికీ, ఈ ఆపరేషన్ గురించి పూర్తి వివరాలు ఇరాన్‌కి అంతుచిక్కడం లేదు. ఇరాన్‌ని అణుదేశంగా నిర్మించేందుకు ‘‘ప్రాజెక్టు అమద్’’ వెనక ఉన్న ప్రధాన సూత్రధారి ఇతనే. చాలా రోజుల వరకు ఇతను బయటకు కనిపించలేదు. కనీసం అతడి ఫోటో కూడా ఎవరి వద్ద లేదు. ఇతడిని ‘‘ఇరాన్ రాబర్ట్ ఓపెన్ హైమర్’’గా పిలిచేవారు. అంటే, ఆయన ప్రాధాన్యత ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
2018లో ఇరానియన్ అణు ఫైళ్లు నాటకీయంగా ఇజ్రాయిల్ కు చిక్కాయి. తొలిసారిగా ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ ఫక్రిజాదే పేరును చెప్పారు. ఈ పేరును గుర్తుంచుకో అని అన్నారు. అప్పటి నుంచి మొసాద్ ఇతనే టార్గెట్‌గా పని చేసింది.
మొహ్సేద్ ఫక్రిజాదేహ్ హత్య ఓ అద్భుతం..
నవంబర్ 27, 2020న, మొహ్సేన్ ఫక్రిజాదేహ్ తన భార్య, అంగరక్షకులతో కలిసి టెహ్రాన్‌కు తూర్పున ఉన్న అబ్సార్డ్ పట్టణంలోని వారి విల్లా వైపు ప్రయాణిస్తున్నాడు. అతను ప్రతీరోజు సాధారణంగా ప్రయాణించే మార్గమే. మరోవైపు, అతడికి అత్యంత భద్రత ఉంది.
అయితే, అదే సమయంలో ఒక పికప్ ట్రక్ రోడ్డు పక్కనే ఉంది. దీనిలో 7.62 mm FN MAG మెషిన్ గన్ అమర్చబడి ఉంది. ఫేస్ రికగ్నైజేషన్ ఏఐ ద్వారా, శాటిలైట్ లింక్స్ అనుసంధానంతో, పేలుడు పదార్థాలతో అమర్చబడి ఉంది. ఈ ఆపరేషన్‌లో ఎలాంటి ఏజెంట్లు కూడా లేరు. పూర్తిగా టెక్నాలజీ ఆధారంగా హత్య జరిగింది. ఇరాన్ అధికారులు చెబుతున్న దాని ప్రకారం, ఆయుధం శాటిలైట్ ద్వారా దేశం బయట ఉన్న ఇజ్రాయిల్ ఏజెంట్లు హత్య చేసినట్లు చెబుతారు.
ఫక్రిజాదేహ్ కారు స్పీడ్ బ్రేకర్ వద్ద కారు వేగాన్ని తగ్గించగానే, ఒక వీధి కుక్క రోడ్డు దాటింది. అదే సమయంలో మెరుపువేగంతో మెషిన్ గన్ బుల్లెట్లను పేల్చింది. అతను ప్రయాణిస్తున్న కారుపైకి తూటాల వర్షం కురిపించింది. రెండో రౌండ్ కాల్పుల్లో కార్ విండ్ షీల్డ్ బద్ధలైంది. కారు నుంచి బయటకు వచ్చిన అతి వెన్నులోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. ఫక్రిజాదేహ్ అక్కడికక్కడే మరణించారు. ఈ మొత్తం ఆపరేషన్‌లో హైలెట్ ఏంటంటే కారులో ఉన్న అతడి భార్యకు ఎలాంటి గాయలు కాలేదు. ఒక్క నిమిషం కన్నా తక్కువ సమయంలోనే ఆపరేషన్ పూర్తయింది.
ఈ దాడి తర్వాత ట్రక్ పేలిపోయింది. ఎలాంటి ఆధారాలు దొరకకుండా ట్రక్ ఆపరేషన్ తర్వాత పేలిపోయేలా ప్లాన్ చేశారు. అయితే, అందులోని భాగాలు అన్ని నాశనం అవుతాయని భావించినప్పటికీ, చాలా పరికరాలు నేలపై పడిపోయాయి. తర్వాత వీటిని ఇరాన్ అధికారులు చేతికి వచ్చాయి. పూర్తిగా రోబోటిక్ తుపాకీ, రిమోట్ ద్వారా చేసిన హైటెక్ హత్యగా దీనిని చూశారు.
అయితే, ఈ హత్యపై మొసాద్ కానీ ఇజ్రాయిల్ కానీ ఎప్పుడూ బహిరంగంగా అంగీకరించలేదు. కానీ మాజీ మొస్సాద్ చీఫ్ యోస్సీ కోహెన్ మాత్రం ఇజ్రాయిల్ ప్రమేయాన్ని సూచించారు. నెలల తరబడి టార్గెట్ చేసి ఫక్రిజాదేహ్‌ని హత్య చేశారు. పరికరాలను ముక్కలుగా ఇరాన్‌లోకి ట్రాన్స్ పోర్ట్ చేసి, రహస్యంగా ఆపరేషన్ నిర్వహించారు.