IND vs ENG Test Series: ఇంగ్లాండ్ పర్యటన టీమిండియా టెస్ట్ చరిత్రలో ఎప్పుడూ ఓ సవాలుతో కూడిన అధ్యాయం. స్వింగ్, సీమ్‌కు ప్రసిద్ధమైన ఇంగ్లాండ్ పిచ్ లపై భారత్ కు విజయం సాధించడం ఎప్పుడూ కష్టసాధ్యమే. 1932లో మొదటిసారిగా ఇంగ్లాండ్ టూర్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఎన్నో మధురమైన, సవాలుతో కూడిన క్షణాలను భారత జట్టు అనుభవించింది. ఇప్పడు, 2025లో ఇంగ్లాండ్‌లో 18 ఏళ్లుగా సాధించలేని టెస్ట్ సిరీస్ విజయాన్ని సాధించేందుకు కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ల నాయకత్వంలో భారత జట్టుకు మరో అవకాశమొచ్చింది.
Read Also: Iran Attacks Israel: ఇజ్రాయిల్‌పైకి ఇరాన్ హైపర్‌సోనిక్ మిస్సైల్.. ఫత్తాహ్-1 గురించి కీలక విషయాలు..
భారత్ ఇంగ్లాండ్‌లో చివరిసారి టెస్ట్ సిరీస్‌ను 2007లో రాహుల్ ద్రవిడ్ కెప్టెన్సీలో గెలిచింది. ఆ తర్వాత ఇంగ్లాండ్ గడ్డపై భారత్ కు ఒక్క సిరీస్ విజయం కూడా లేదు. ఈసారి గిల్, గంభీర్ నాయకత్వంలో 18 ఏళ్ల నిరీక్షణను ముగించగలరా అన్నదే ప్రశ్న. భారత జట్టు ఇంగ్లాండ్‌లో తొలి టెస్ట్ మ్యాచ్‌ను 1932లో లార్డ్స్ మైదానంలో ఆడింది. ఇప్పటివరకు అక్కడ 67 టెస్ట్‌లు ఆడి 9 విజయాలు మాత్రమే సాధించగలిగింది. అలాగే 38 మ్యాచ్‌ల్లో ఓటమి పాలవగా.. 20 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. ఇంగ్లాండ్‌లో భారత్ ఇప్పటివరకు 20 టెస్ట్ సిరీస్ లను ఆడగా, కేవలం 3 సిరీస్ లలో మాత్రమే విజయం సాధించింది.
Read Also: Joe Root: ‘బజ్‌బాల్’ సరికాదేమో.. ఇండియా సిరీస్‌కు ముందు జో రూట్ కీలక వ్యాఖ్యలు..!
ఇక ఇంగ్లాండ్‌లో భారత్ తరఫున అత్యధిక టెస్ట్ పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్. ఆయన అక్కడ 23 టెస్ట్ లలో 1571 పరుగులు చేసారు. అందులో 4 శతకాలు ఉన్నాయి. ఇక బౌలింగ్‌లో కపిల్‌దేవ్ 85 వికెట్లు (21 టెస్టులు)తో టాప్‌లో ఉన్నారు. ఇంగ్లాండ్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యుత్తమ బౌలింగ్ చేసిన భారత బౌలర్ ఇశాంత్ శర్మ. 2014లో లార్డ్స్‌లో 74 పరుగులకు 7 వికెట్లు తీసాడు. కపిల్‌దేవ్, అనిల్ కుంబ్లేలు 5 వికెట్లను నాలుగు సార్లు తీశారు.
ఈసారి భారత్ యువ జట్టుతో ఇంగ్లాండ్‌కు పయనమవుతోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ లాంటి దిగ్గజాలు రిటైర్మెంట్ తీసుకున్న నేపథ్యంలో పూర్తిగా కొత్త తరం జట్టు రంగంలోకి దిగనుంది. ఇంగ్లాండ్‌లో పిచ్‌లు స్వింగ్‌కు అనుకూలంగా ఉండటంతో భారత బ్యాటింగ్ లైనప్‌కు ఇదొక పెద్ద పరీక్ష. జేమ్స్ అండర్సన్ రిటైర్ అయినప్పటికీ, ఇంగ్లాండ్ కొత్త బౌలింగ్ కూడా ప్రమాదకరంగా ఉంది. అయితే, భారత బౌలర్లు కూడా అంతే బలంగా ఉన్నారు. గతంలో యువ ఆటగాళ్లతో గబ్బా వేదికపై ఆస్ట్రేలియాను చిత్తుచేసిన జట్టు ఇది. ఇప్పుడు అదే ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ఇంగ్లాండ్ గడ్డపై 18 ఏళ్ల నిరీక్షణను ముగించే అవకాశం గిల్ సారధ్యంలో భారత జట్టుకు వచ్చింది.