Mexican Couple: భారత సంస్కృతి, సంప్రదాయాలు విదేశీయులను ఆకర్షించడం సాధారణమే. హిందూ మతాన్ని అవలంభిస్తూ భారత్‌కు ఎంతో మంది విదేశీయులు యాత్రల కోసం వస్తారు. ఇంకొంత మంది మన సంస్కృతిపై అభిమానంతో హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసుకునేందుకు భారత్‌కు వస్తుంటారు. తాజాగా ఓ మెక్సికన్ జంట హిందూ సంప్రదాయంపై అభిమానంతో పెళ్లి చేసుకునేందుకు ఇండియా వచ్చింది. స్వచ్ఛమైన ప్రేమకు చిహ్నమైన తాజ్‌నగరి ఆగ్రాలో ఈ ప్రేమజంట ఏకమైంది. తాజ్ వద్ద ఎందరో తమ ప్రేమను వ్యక్తపరుస్తుంటే వీరు ఏకంగా ఆ నగరంలో వివాహాన్ని చేసుకున్నారు. భారత సంస్కృతి, సంప్రదాయంపై గౌరవంతో ఈ మెక్సిన్ జంట భారతీయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. డీజే పాటలతో, అతిధుల నడుమ బరాత్ కనులవిందుగా జరిగింది. వధువు పేరు క్లాడియా, వరుడి పేరు సెరామికో. ఈ మెక్సికన్లు మొఘల్ చక్రవర్తి షాజహాన్, ముంతాజ్ బేగంల ప్రేమకథతో స్ఫూర్తిపొందారు. అంతేకాదు, షాజహాన్, ముంతాజ్‌ల అజరామర ప్రేమకు చిహ్నమైన తాజ్ మహల్ వారిని విశేషంగా ఆకర్షించింది. తమ ప్రేమ కూడా చిరస్థాయిగా నిలిచిపోవాలని వారు ఆకాంక్షించారు.
అందుకే క్లాడియా, సెరామికో తమ ప్రేమను పండించుకునేందుకు ఆగ్రా వచ్చారు. ఇక్కడి శివాలయంలో పూర్తి హిందూ సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్నారు. గౌరవ్ గుప్తా అనే హోటల్ యజమాని వీరి పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశారు. స్థానికంగా ఓ రెస్టారెంటులో భారీ విందు కార్యక్రమం జరిగింది. ఈ పెళ్లికి క్లాడియా, సెరామికోల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్థానిక టూర్ ఆపరేటర్లు, గైడ్లు, డ్రైవర్లు, స్థానిక హోటళ్ల సిబ్బంది హాజరయ్యారు. ఇక వధువు అతి సుందరమైన లెహంగాతో చూపు తిప్పుకోలేని అందంతో పెళ్లిమండపంలోకి అడుగు పెట్టింది. అతిధుల సమక్షంలో ముక్కొటి దేవతల సాక్షిగా వేద మంత్రాల నడుమ ఈ జంట ఒకటయ్యారు.వారి పదేళ్ల ప్రేమ బంధాన్ని పవిత్ర బంధంతో ముడివేసుకున్నారు. ప్రస్తుతం ఈ పెళ్లి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ జంటను చూసిన ప్రతి ఒక్కరు అభినందనలు తెలుపుతున్నారు. సప్తసముద్రాలు దాటి ఆగ్రాకు వచ్చి ఒకటయ్యారని నెటిజన్లు అంటున్నారు. మెక్సికోకు చెందిన సెరామికో, క్లాడియా గత పదేళ్లుగా ఒకరినొకరు ప్రేమించుకున్నారు.
Central Government: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మరోసారి పెరగనున్న జీతాలు
వీరిద్దరికి తాజ్ మహాల్ అంటే ఎంతో ఇష్టం. అందుకనే వీరి పెళ్లికి ఆగ్రానే సరైన వేదిక అని భావించామని మెక్సికో కపుల్ తెలిపారు. హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకుంటే అది ఏడు జన్మల బంధంగా మారుతుందన్న మాటను గట్టిగా నమ్ముతున్నామని ఈ కొత్త జంట తెలిపింది. అందుకనే తాము ఇక్కడ వివాహం చేసుకున్నామని చెబుతున్నారు. కొంత మంది సన్నిహితులను ఆహ్వనించి ఈ వేడుకలను చేసుకున్న ఈ జంట పెళ్లికి, హోటల్ సిబ్బంది సైతం అతిథులుగా హాజరై బరాత్లో డ్యాన్స్ చేశారు. అతిథులందరూ కలిసి కొత్త జంటతో పాటు విందు ఆరగించారు. కాగా, పెళ్లితో ఒక్కటైన ఈ మెక్సికో జంట మాట్లాడుతూ, షాజహాన్, ముంతాజ్‌ల ప్రేమకథ తమను కదిలించివేసిందని చెప్పారు. భారత సంస్కృతి అంటే తమకు ఎంతో ఇష్టమని, పెళ్లంటూ చేసుకుంటే భారత్‌లోనే చేసుకోవాలని చాన్నాళ్ల క్రితమే నిర్ణయించుకున్నామని తెలిపారు. కాగా, ఈ పెళ్లి తంతుకు రూ.35 వేలు ఖర్చయ్యాయని హోటల్ యజమాని గౌరవ్ గుప్తా వెల్లడించారు.