Pakistan: ఉగ్రవాదులకు స్వర్గధామంగా ప్రపంచంలోనే పేరు తెచ్చుకున్న పాకిస్తాన్, ఇప్పుడు ఆ ఉగ్రవాదానికే బలవుతోంది. పాకిస్తాన్ వ్యాప్తంగా గత కొంత కాలంగా ఉగ్రదాడులు పెరుగుతున్నాయి. ముక్యంగా తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్(టీటీపీ)తో పాటు మరికొన్ని ఉగ్రసంస్థలు అక్కడి పోలీస్ అధికారులను, సైన్యాన్ని టార్గెట్ చేస్తున్నాయి. టీటీపీకి మంచి పట్టున్న ఖైబర్ ఫఖ్తుంఖ్వా, వజీరిస్తాన్ ప్రాంతాల్లో దాడులకు తెగబడుతోంది. మరోవైపు బెలూచిస్తాన్ పోరాటయోధులు తమ స్వాతంత్య్రం కోసం ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. వీరు చైనా-పాక్ ఎకనామిక్ కారిడార్‌ని, పాక్ సైన్యాన్ని, చైనీయులను టార్గెట్ చేసుకుంటూ బలూచిస్తాన్, సింధ్ ప్రాంతాల్లో దాడులు చేస్తున్నారు. ఇలాంటి పరిణామాల మధ్య పాకిస్తాన్, పాక్ తాలిబాన్లను అరికట్టాలని ఆఫ్ఘన్ లోని తాలిబాన్ ప్రభుత్వాన్ని కోరుతోంది.
ఇదిలా ఉంటే తాజాగా పాకిస్తాన్ భారీ ఉగ్రదాడి నుంచి తప్పించుకుంది. పంజాబ్ ప్రావిన్సులో అతిపెద్ద ఉగ్రదాడిని అక్కడి అధికారులు భగ్నం చేశారు. 14 మంది పాక్ తాలిబాన్, ఐఎస్ఐ ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలు, నిషేధిత సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్ లోని వివిధ జిల్లాల్లో తాము 147 ఇంటెలిజెన్స్ ఆధారిత దాడులు చేశామని, కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్(సీటీడీ) పంజాబ్ తెలిపింది.
Read Also: Russia-Ukraine War: ప్రమాదం అంచున జపొరిజ్జియా అణు కర్మాగారం..
గుజ్రాన్‌వాలా, బహవల్‌పూర్, సాహివాల్, ఫైసలాబాద్, సర్గోధా జిల్లాలతో పాటు లాహోర్ నగరంలో ఇంటెలిజెన్స్ సమాచారంతో దాడులు నిర్వహించారు. పట్టుబడిని వారికి ఐఎస్ఐఎస్, తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (టిటిపి)లకు చెందిన ఉగ్రవాదులతో పాటు లష్కరే ఝాంగ్వీ(ఎల్ఈజే) ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్లు పాక్ అధికారులు తెలిపారు. వీరంతా పంజాబ్ ప్రావిన్సులో విధ్వంసానికి ప్లాన్ చేశారని సీటీడీ అధికారులు చెప్పారు. ఉగ్రవాదుల నుంచి దాదాపు 4.3 కిలోల పేలుడు పదార్థాలు, మూడు హ్యాండ్ గ్రెనేడ్లు, నాలుగు ఐఈడీ బాంబులు, 20 డిటోనేటర్లు, 32 అడుగుల సేఫ్టీ ఫ్యూజ్ వైర్, 6.5 అడుగుల ప్రైమా కార్డ్, నిషేధిత సాహిత్యం, నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఉగ్రవాదులపై 13 కేసులు నమోదు చేసిన పోలీసులు తదుపరి విచారణ కోసం వారిని గుర్తు తెలియని ప్రదేశానికి తరలించారు.