Los Angeles: అక్రమ వలసదారుల అరెస్టులకు నిరసనగా అగ్రరాజ్యం అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో మొదలైన నిరసనలు దేశవ్యాప్తంగా విస్తరించాయి. ఓ వైపు కేంద్ర బలగాల మోహరింపు.. మరోవైపు ఆందోళనలతో పలు నగరాలు అట్టుడికి పోతున్నాయి. ఇక, నిరసనలకు కేంద్ర బిందువుగా మారిన లాస్ ఏంజెలెస్‌లో పోలీసులు కర్ఫ్యూ విధించారు. అలాగే, ఆస్టిన్, టెక్సాస్, చికాగో, న్యూయార్క్, డల్లాస్, డెన్వర్‌తో సహా అనేక ఇతర నగరాల్లో ఆందోనలు కొనసాగుతున్నాయి. వీకెండ్ సమయంలో నిరసనలు మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఇక, శనివారం నాడు అనేక గ్రూపులు ఈ ఉద్యమంలో పాల్గొనే అవకాశం ఉంది.
Read Also: Rains : తెలంగాణలో జూన్ 15 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక
అయితే, లాస్ ఏంజిల్స్ లో శనివారం నుంచి అధికారులు ఇప్పటి వరకు సుమారు 400 మందిని అరెస్టు చేశారు. వీరిలో 330 మంది వలసదారులు ఉండగా, మరో 157 మందిని వారికి మద్దతు తెలిపినందుకు అదుపులోకి తీసుకున్నారు. ఇక, ఈ ఘర్షణల్లో ఒక పోలీసు అధికారిపై హత్యాయత్నం చేసినందుకు మరోకర్ని.. అలాగే, లాస్ ఏంజిల్స్‌లో జరిగిన రెండు వేర్వేరు సంఘటనలలో పోలీసు అధికారులపై మోలోటోవ్ కాక్‌టెయిల్స్ విసిరినందుకు ఇంకో ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు యూఎస్ అటార్నీ బిల్ ఎస్సేలీ వెల్లడించారు. కాగా, ఈ నిరసనలను అణిచివేయడానికి అధ్యక్షుడు ట్రంప్ 700 మంది మెరైన్లతో సహా వేలాది మంది సైనికులను లాస్ ఏంజిల్స్ లో మోహరించారు. దీంతో ఆందోళనలు చేస్తున్న ప్రజలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు.