Samsung Boss Gets Presidential Pardon: సామ్‌సంగ్ గ్రూప్ వారసుడు లీజే యాంగ్ కు విముక్తి లభించింది. ఆర్థిక అవినీతి, లంచం కేసులో శిక్ష అనుభవిస్తున్న ఆయనకు దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ ఇయోల్ క్షమాభిక్ష పెట్టారు. ఆగస్టు 15 దక్షిణ కొరియా లిబరేషన్ డేను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా శిక్ష అనుభవిస్తున్న 17 వందల మంది దోషులకు దక్షిణ కొరియా ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టింది. ఇందులో లీ జే యాంగ్ పేరు కూడా ఉంది. గతేడాది జనవరిలో లంచం, అక్రమార్జన ఆరోపణలకు పాల్పడ్డారనే అభియోగాలపై బిలియనీర్ లీ జే యాంగ్ కు శిక్ష విధించింది అక్కడి ప్రభుత్వం. లీ జే యాంగ్ ఫోర్బ్స్ ప్రకారం 7.9 బిలియన్ డాలర్ల విలువతో ప్రపంచంలోనే 278వ ధనవంతుడిగా ఉన్నారు.
Read Also: Gurmeet Ram Rahim: డేరా బాబాకు వేలాదిగా రాఖీలు.. గతంతో పోలిస్తే తక్కువే అంటున్న పోస్టల్ శాఖ
సామ్‌సంగ్ గ్రూప్ అధినేత లీ కున్ హీ పెద్ద కుమారుడైన లీ జే యాంగ్ సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ వైస్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. సామ్‌సంగ్ కంపెనీకి చెందిన రెండు అనుబంధ కంపెనీల విలీనం కోసం 2015లో అప్పటి అధ్యక్షురాలు పార్క్ గ్వెన్ హైకు లంచం ఇచ్చారనే ఆరోపణలపై శిక్షను అనుభవిస్తున్నారు. ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చిన తర్వాత పార్క్ గ్వెన్ హై ప్రభుత్వ కూలిపోయింది. దక్షిణ కొరియా సుప్రీం కోర్టు లీ జే యాంగ్ కు రెండున్నరేళ్ల శిక్షను విధించింది. దాాదాపు శిక్షలో సగం కాలం 18 నెలలు శిక్ష ముగిసిన తర్వాత 2021 ఆగస్టులో పెరోల్ పై బయటకి వచ్చారు. తాజాగా ప్రభుత్వ క్షమాభిక్ష వల్ల బయటకు రానున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభాన్ని అధిగమించేందుకు ఆయనపై ఉన్న అన్ని ఆంక్షలు, అభియోగాలను ఎత్తేసినట్లు న్యాయ శాఖ మంత్రి హాన్ డాంగ్ హూన్ వెల్లడించారు.