Israel: ఇజ్రాయిల్-ఇరాన్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. హమాస్ పొలిటికల్ బ్యూరో చీఫ్ ఇస్మాయిల్ హనియేని తమ గడ్డపై, తమ రాజధాని టెహ్రాన్‌లో హత్య చేయడంపై ఇరాన్ ప్రతీకారంతో రగిలిపోతోంది. ఈ క్షణానైనా ఇజ్రాయిల్‌పై దాడి చేసేందుకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే ఇరాన్ మద్దతు ఉన్న లెబనాన్ మిలిటెంట్ సంస్థ హిజ్బుల్లా ఇజ్రాయిల్‌పై విరుచుకుపడుతోంది. ఇజ్రాయిల్ ఉత్తర ప్రాంతంలోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడి చేస్తోంది.
Read Also: Bangladesh Violence: బంగ్లా పార్లమెంట్ రద్దు.. భారత వ్యతిరేక శక్తుల చేతుల్లోకి అధికారం..
ఇటీవల ఇజ్రాయిల్ వైమానిక దాడిలో లెబనాన్ రాజధాని బీరూట్‌లో హిజ్బుల్లా సీనియర్ కమాండర్ ఫువాద్ షుక్ర్‌ని హతమార్చింది. అయితే, ఇజ్రాయిల్ లెబానాన్ నుంచి వస్తున్న శత్రువుల డ్రోన్లు అడ్డగించింది. ఉత్తర ఇజ్రాయెల్‌లోని ఎకర్ సమీపంలోని రెండు మిలిటరీ సైట్‌లలో దాడి చేసిన డ్రోన్‌ల సమూహాన్ని ప్రారంభించామని, మరో ప్రదేశంలో ఇజ్రాయెల్ సైనిక వాహనంపై కూడా దాడి చేశామని హిజ్బుల్లా చెప్పింది. ఇజ్రాయిల్ సైన్యం లెబనాన్ నుంచి వస్తున్న అనేక డ్రోన్లను గుర్తించి వాటిని అడ్డగించినట్లు తెలిపింది. దక్షిణ లెబనాన్‌లోని రెండు హిజ్బుల్లా సైనిక స్థావరాలపై తమ వైమానిక దళం దాడి చేసినట్లు తెలిపింది.