Kim Jong Un: ఎప్పుడూ యుద్ధం గురించి వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోసారి అమెరికాతో కయ్యానికి కాలు దువ్వే విధంగా ఆయన మాట్లాడారు. కిమ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు చూస్తే ఉత్తర కొరియా మరోసారి ప్రపంచానికి సవాల్ విసరనుందన్న భావన కలుగుతోంది. తమకు అమెరికా, దక్షిణ కొరియా దేశాల నుంచి ముప్పు ఉందని, తాము ఆత్మరక్షణ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని కిమ్ అన్నారు. అగ్రదేశం అమెరికా, దక్షిణ కొరియాపై ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ అణు బెదిరింపులకు దిగారు. ఆ దేశాలతో ఎలాంటి సైనిక ఘర్షణనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. 2017 తర్వాత మొదటిసారి ఉత్తరకొరియా అణ్వస్త్ర పరీక్షకు దిగుతుందన్న అంచనాల మధ్య కిమ్ నుంచి ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. ఈ మేరకు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీవెల్లడించింది. కొరియా దేశాల మధ్య యుద్ధం ముగింపు 69వ వార్షికోత్సవం సందర్భంగా నియంత నోటి నుంచి ఈ మాటలు వచ్చాయి.
ఉత్తర కొరియాను అమెరికా ఒక బూచిలా చూపుతోందని, ఓవైపు తమ భద్రతకు ముప్పు కలిగేలా అమెరికా సైనిక విన్యాసాలు చేపడుతోందని, మరోవైపు ఉత్తర కొరియా సాధారణ సైనిక విన్యాసాలు చేపట్టినా రెచ్చగొట్టే చర్యలంటూ తప్పుడు ప్రచారం చేస్తోందని కిమ్ మండిపడ్డారు. దక్షిణ కొరియాతో కలిసి అమెరికా చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తోందని అన్నారు. తన చర్యలను సమర్థించుకుంటూ, ఉత్తర కొరియాను వేలెత్తి చూపిస్తోందని కిమ్ అగ్రరాజ్యంపై విమర్శలు చేశారు. అణుముప్పు సహా ఎలాంటి సంక్షోభాన్నయినా ఎదుర్కొనేందుకు ఉత్తర కొరియా పూర్తి సన్నద్ధతతో ఉందని స్పష్టం చేశారు. ఆత్మరక్షణ నిమిత్తం ఈ తక్షణ చారిత్రక కర్తవ్యాన్ని సాధించాల్సి ఉందన్నారు. యుద్ధం ముగిసి 70 సంవత్సరాలు కావస్తోన్న సమయంలో కూడా దక్షిణ కొరియాతో కలిసి అమెరికా.. ప్రమాదకరమైన, చట్టవిరుద్ధమైన చర్యలకు దిగుతోందని ఆయన ఆరోపించారు. ఉత్తర కొరియా దేశాన్ని ఒక బూచిలా చూపి తన చర్యలను సమర్థించుకునే ప్రయత్నం చేస్తోందంటూ మాట్లాడారు.
భారతదేశంలోని 10 అత్యంత ప్రమాదకరమైన రోడ్డు మార్గాలు
కిమ్ జాంగ్ ఉన్ నాయకత్వంలోని ఉత్తర కొరియా 2017 తర్వాత ఇప్పటిదాకా అణు పరీక్షకు పూనుకోలేదు. ఇప్పుడు మొదటి అణ్వస్త్ర పరీక్ష నిర్వహించేందుకు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందంటూ ఇటీవల అమెరికా, దక్షిణ కొరియా అధికారులు వెల్లడించారు. మరోవైపు దక్షిణ కొరియా రక్షణ సిబ్బంది మాత్రం అలాంటి సంకేతాలేవీ లేవని చెప్పడం గమనార్హం.