PoK Protest: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లో ప్రజలు తమ హక్కుల కోసం నినదిస్తున్నారు. గత వారం రోజులుగా పీఓకేలోని పలు ప్రాంతాల్లో నిరసనలు మిన్నంటాయి. వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి, పాకిస్తాన్ ఆర్మీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ నిరసనల్ని అణిచివేసేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం, ఆర్మీని ఉపయోగిస్తోంది. ఆర్మీ జరిపిన కాల్పుల్లో ఇప్పటి వరకు 15 మంది మరణించినట్లు తెలుస్తోంది.
గురువారం ఘర్షణలు మూడో రోజుకు చేరుకున్నాయి. దద్యాల్‌లో నిరసనకారులు, ఆర్మీకి మధ్య ఘర్షణ జరిగింది. ఘర్షలు పెద్దవిగా మారుతుండటంతో అదనపు బలగాలను పాక్ ప్రభుత్వం పీఓకేకి తరలించింది. ముజఫరాబాద్ తో పాటు రావాల్ కోట్, నీలం వ్యాలీ, కోట్లీ ప్రాంతాల్లో హింస వ్యాపించింది.
Read Also: Rahul Gandhi: “ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోంది, చైనాపై ప్రశంసలు”.. కొలంబియాలో రాహుల్ గాంధీ..
జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామి యాక్షన్ కమిటీ (AAC) నేతృత్వంలో ఈ నిరసనలు జరుగుతున్నాయి. పాకిస్తాన్‌లో నివసిస్తున్న కాశ్మీరీ శరణార్థులకు పీఓకేలో రిజర్వ్ చేయబడిని 12 అసెంబ్లీ స్థానాలను రద్దు చేయాలనే డిమాండ్ ఈ ఆందోళనకు కేంద్రంగా ఉంది. దీంతో పాటు పన్నుల మినహాయింపు, గోధుమ పిండి, విద్యుత్‌పై సబ్సిడీలు, అభివృద్ధి పథకాలను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 29 న ప్రారంభమైన నిరసనల కారణంగా పీఓకేలోని మార్కెట్లు, వ్యాపారాలు మూతపడ్డాయి.
‘‘కాశ్మీర్ మాది, దాని విధిని మేము నిర్ణయిస్తాము’’ అంటూ ప్రజలు నినదిస్తున్నారు. ఇలా పాకిస్తాన్ ప్రభుత్వాన్ని, ఆర్మీని పీఓకే ప్రజలు లక్ష్యంగా చేసుకోవడం ఇదే తొలిసారి. నిరసనలు పెరుగుతుండటంతో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చర్చలకు పిలుపునిచ్చారు. శాంతియుత పరిష్కారాన్ని కనుగొనడానికి చర్చల కమిటీని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉందని అన్నారు.