Doctors Continue Surgery: హ్యాట్సాఫ్.. భూకంపం వణికించినా.. పేషెంట్ ప్రాణాల కోసం కదలని వైద్యులు! వీడియో వైరల్..

Doctors

Doctors

Doctors Continue Surgery: జపాన్‌లోని కుమమొటోలో సంభవించిన భారీ భూకంపం వేళ ఓ ఆస్పత్రిలో చోటుచేసుకున్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రాణాల కంటే బాధ్యతే ముఖ్యమని నిరూపిస్తూ వైద్యులు, నర్సులు చూపించిన ధైర్యం నెటిజన్లను కదిలిస్తోంది. దీంతో నెట్టిజన్లు వారి ధైర్యాన్ని కొనియాడుతూ.. నిజమైన దేవుళ్లు అని కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల కుమమొటో ప్రాంతంలో 7.1 తీవ్రతతో భూకంపం సంభవించిన సమయంలో ఓ ఆస్పత్రిలో సర్జరీ జరుగుతోంది. భూకంపం కారణంగా ఆస్పత్రి భవనం ఒక్కసారిగా బలంగా ఊగిపోయింది. దీంతో ఆపరేషన్ థియేటర్‌లో ఉన్న వైద్యులు, నర్సులు కూడా ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కొన్నారు.

అయినప్పటికీ సాధారణ పౌరుల వలే వారు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు బయటకు పరుగులు తీయలేదు. కర్తవ్య నిర్వాహణలో ఉన్న వాళ్లు ఆపరేషన్ మధ్యలో ఉన్న రోగిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదని నిర్ణయించుకున్నారు. వైద్య బృందం.. పేషెంట్ చుట్టూ రక్షణగా నిలబడి, ఆపరేషన్ టేబుల్‌ను స్థిరంగా ఉంచేందుకు ప్రయత్నించారు. భవనం ఊగుతున్నప్పటికీ ఏమాత్రం ఆందోళనకు గురికాకుండా సర్జరీని విజయవంతం కొనసాగించారు. పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా వైద్యులు ఎంతో ప్రశాంతంగా వ్యవహరించిన తీరు ఇప్పుడు ప్రశంసలు అందుకుంటోంది. చివరకు ఎలాంటి అవాంతరాలు లేకుండా సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. పేషెంట్ ప్రాణాలను కాపాడటంలో వైద్య బృందం సక్సెస్ అయ్యింది. ఈ ఘటనకు సంబంధించినట్లు చెబుతున్న సీసీటీవీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. వీడియోను చూసిన నెటిజన్లు వైద్యుల అంకితభావం, ధైర్యసాహసాలను ప్రశంసిస్తూ కొనియాడుతున్నారు. విపత్కర పరిస్థితుల్లోనూ తమ బాధ్యతను మరవకుండా రోగి ప్రాణాలను కాపాడేందుకు ముందుకు వచ్చిన వైద్యులకు సెల్యూట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.