పశ్చిమాసియాలో యుద్ధం ఇంకా కొనసాగుతోంది. హమాస్ అంతమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉంది. తాజాగా గాజాపై జరిపిన వైమానిక దాడుల్లో ఆస్పత్రిలో ఉన్న 29 మంది మరణించారు. ఉత్తర గాజాలోని కమల్ అద్వాన్ ఆస్పత్రిని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఈ ఘటనలో ఆసుపత్రిలో నలుగురు వైద్య సిబ్బందితో సహా కనీసం 29 మంది చనిపోయినట్లు పాలస్తీనా అధికారులు తెలిపారు. మృతుల్లో ఐదుగురు చిన్నారులు, ఐదుగురు మహిళలు ఉన్నారని ఆసుపత్రి క్యాజువాలిటీ జాబితా పేర్కొంది.
ఇది కూడా చదవండి: CM Revanth Reddy: యాదాద్రి థర్మల్ స్టేషన్ రెండో యూనిట్‌ను జాతికి అంకితం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
ఇటీవల లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముగింపునకు చర్చలు ఫలించాయి. దీంతో లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు ఆగిపోయాయి. కానీ గాజాపై మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా జరిగిన దాడిలో 29 మంది పాలస్తీనీయులు చనిపోయారు.
అక్టోబర్ 7, 2023న హమాస్.. హఠాత్తుగా ఇజ్రాయెల్‌పై దాడి చేసి ఇజ్రాయెల్ పౌరులను బందీలుగా తీసుకుపోయారు. దీంతో అప్పటి నుంచి ఇజ్రాయెల్ ప్రతీకారంతో రగిలిపోతుంది. ఆ నాటి నుంచి హమాస్ అంతమే లక్ష్యంగా దాడులు చేస్తూనే ఉంది. ఇప్పటికే వేలాది మంది పాలస్తీనీయులు చనిపోయారు. నివాసాలు శిథిలమైపోయాయి. ప్రజలు వలసపోయారు. ఇంకోవైపు బందీలను విడిపించుకునేందుకు ఐడీఎఫ్ దళాలు ప్రయత్నిస్తున్నాయి. బందీలను విడిపించుకునేందుకు ప్రస్తుతం గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం చేస్తోంది.
ఇది కూడా చదవండి: Pragya Nagra: ప్రయివేట్ వీడియో లీక్.. స్పందించిన టాలీవుడ్ హీరోయిన్