Israel Iran War: ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య యుద్ధం యావత్ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఈ యుద్ధం మూలంగా చమురు సరఫరాపై ప్రభావం పడుతుందని అన్ని దేశాలు భయపడుతున్నాయి. మరోవైపు, శుక్రవారం నుంచి ఇరు దేశాల మధ్య ఘర్షణ ఆరో రోజుకు చేరింది. ఇరాన్ అణు కార్యక్రమాలే లక్ష్యంగా ఇజ్రాయిల్ ‘‘ఆపరేషన్ రైజింగ్ లయన్’’ పేరుతో వైమానిక దాడులు చేసింది. ఇరాన్ అణు శాస్త్రవేత్తలను, మిలిటరీ టాప్ జనరల్స్‌ని హతమార్చింది. ఇరాన్ కూడా బాలిస్టిక్, హైపర్ సోనిక్ మిస్సైళ్లతో ఇజ్రాయిల్ రాజధాని జెరూసలెం, టెల్ అవీవ్, హైఫా నగరాలపై దాడులు చేస్తోంది.
Read Also: Cyber Fraud : ఫేస్‌బుక్ మోసం.. 70 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగికి రూ.38 లక్షల చీటింగ్
ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఇజ్రాయిల్‌కి డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఇరాన్ వందలాది మిస్సైళ్లను ఫైర్ చేస్తుంది. వీటిని ఇజ్రాయిల్ ఐరన్ డోమ్‌తో సహా ఇతర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అడ్డుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్ ఎయిర్ డిఫెన్ సిస్టమ్ క్రమంగా బలహీనపడుతోంది. ఇజ్రాయిల్ లాంగ్ రేంజ్ మిసైల్ ఇంటర్‌సెప్టర్లు సరఫరా వేగం తగ్గుతోందని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఇరాన్ దాదాపుగా 400 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఇవి ఇరాన్ వద్ద ఉన్న 2000 క్షిపణుల్లో భాగం. బాలిస్టిక్ క్షిపణులను ఇజ్రాయిల్ ‘‘యారో సిస్టమ్’’ అడ్డుకుంటుంది.
అయితే, ఇప్పటి వరకు ఇరాన్ కి చెందిన క్షిపణి లాంచర్లలో మూడింట ఒక వంతు నాశనం చేశామని ఇజ్రాయిల్ చెబుతోంది. అయినప్పటికీ ఇరాన్ మద్ద సగానికి పైగా క్షిపణి వ్యవస్థ చెక్కు చెదరకుండా ఉంది. కొంత భాగం భూగర్భాల్లో దాచి ఉంచినట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఇజ్రాయిల్ వద్ద ఐరన్ డోమ్, డేవిడ్ స్లింగ్, యారో సిస్టమ్, పేట్రియాట్స్ అండ్ థాడ్ బ్యాటరీలు బహుళ దశల్లో ఇరాన్ క్షిపణులను అడ్డుకుంటున్నాయి. అయితే, ఇరాన్ ప్రతీ రోజు దాడిని కొనసాగిస్తుండటంతో ఇజ్రాయిల్ క్షిపణి రక్షణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇరాన్ ఇలాగే దాడులు కొనసాగిస్తే ఇజ్రాయిల్ తన రక్షణను మరో 10-12 రోజులు మాత్రమే నిర్వహించగలదని వాల్ స్ట్రీట్ జర్నల్(WSJ) తెలిపింది.