Pakistan: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ నగరంలో మరోసారి లాక్‌డౌన్ విధించారు. ఇటీవల షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్‌సీఓ) సమావేశాల సమయంలో, ప్రధాన దేశాల నేతలు రావడంతో ఇస్లామాబాద్-రావల్పిండిలో లాక్‌డౌన్ విధించింది. తాజాగా మరోసారి మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కోసం అతని మద్దతుదారులు తీవ్ర నిరసనలకు సిద్ధమయ్యారు. ఇస్లామాబాద్ వైపు పాదయాత్రగా వెళ్లేందుకు పిలుపునిచ్చారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) పార్టీ “బానిస సంకెళ్ళను తెంచడానికి” మార్చ్‌లో పాల్గొనాలని ప్రజలకు పిలుపునిచ్చింది.
భారీ భద్రతా బలగాలను మోహరించడం, కీలక రహదారుల్ని మూసివేయడంతో పాటు పలు భద్రతా చర్యల్ని తీసుకుంటున్నారు. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఇస్లామాబాద్‌లో ఎలాంటి నిరసనలు, బైఠాయింపులను అనుమతించబోమని, ప్రజాశాంతికి విఘాతం కలిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అక్కడి హోం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. నిరసన కోసం ప్రజలు ఏకం కావాలని, ఇది స్వేచ్ఛ మరియు న్యాయం కోసం జరిగే ఉద్యమం అని ఇమ్రాన్ ఖాన్ ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు.
Read Also: Mohan Bhagwat : భిన్నత్వంలో కూడా ఏకత్వం ఉంది.. మంచి బుద్ధి, హృదయాన్ని ఇచ్చేది భారతీయ సంస్కృతి
ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఖైబర్ ఫఖ్తుంఖ్వా ముఖ్యమంత్రి అలీ అమీన్ గండాపూర్ తన ఇంట్లో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇస్లామాబాద్ మార్చ్‌కి నాయకత్వం వహించడానికి గండాపూర్ సిద్ధమయ్యాడు. మార్చ్‌కి హాజరుకావాలని భావిస్తున్న కార్యకర్తలు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు స్వాబీ చేరుకోవాలని అతను ఆదేశించారు. ఫిబ్రవరి 08న జరిగిన ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని, జైలులో ఉన్న ఇమ్రాన్‌ఖాన్‌ని విడుదల చేయాలని ఆయన మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇస్లామాబాద్‌ని అక్కడి అధికారులు మూసేశారు. శ్రీనగర్ హైవే, GT రోడ్ మరియు ఎక్స్‌ప్రెస్‌వేతో సహా నగరం అంతటా కంటైనర్లను మోహరించారు. డీ-చౌక్, ఇస్లామాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లే మార్గాల్లో కదలికల్ని పరిమితం చేశారు. పెషావర్ మరియు రావల్పిండి, లాహోర్ మరియు రావల్పిండి మధ్య, అలాగే ముల్తాన్ మరియు ఫైసలాబాద్ నుండి రావల్పిండి మధ్య రైలు సేవల్ని నిలిపేవారు. సెక్షన్ 144 విధించారు. నవంబర్ 2-25 మధ్య నగరం అంతటా సెక్షన్ అమలులో ఉంటుంది. పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ నిలిపేశారు.