ఉక్రెయిన్‌లో రష్యా దాడి మొదలై 25 రోజులు దాటింది. సైనిక చర్య అనేది ఇప్పుడు అది పూర్తి స్థాయి యుద్ధాన్ని తలపిస్తోంది. చర్చలు ఓ కొలిక్కి వచ్చే సూచనలు కనిపించటం లేదు. మరోవైపు రష్యా బలగాలు ఉక్రెయిన్ నగరాలలో విధ్వంసం సృష్టిస్తోంది. దేశంలో రెండో ప్రధాన నగరం మారియుపోల్ సర్వనాశనం అయింది. ఎక్కడ చూసినా యుద్ధం తాలూకు ధ్వంసమే. ప్రస్తుతం ఈ నగరం రష్యా దళాల స్వాధీనంలో ఉన్నట్టు తెలుస్తోంది.
అటు పుతిన్ బలగాలు రాజధాని కీవ్‌కు అతి సమీపానికి వచ్చాయి. ఉక్రెయిన్ బలగాలు ప్రతిఘటనతో రష్యా వ్యూహం మారుస్తూ ముందుకు వెళుతోంది. ప్రస్తుతం ఆ దేశ ఆగ్నేయ ప్రాంతాలను టార్గెట్ చేసి కీవ్‌పై వత్తిడి పెంచాలని చూస్తోంది. ఏదేమైనా, అసలు పుతిన్ మనసులో ఏం ఉందో ఎవరికీ తెలియదు. పశ్చిమ మీడియా కథనాలు ఎలా ఉన్నా ఆయన మాత్రం అనుకున్నది చేసుకుపోతున్నాడు. ప్రస్తుతం కీవ్‌ను చుట్టుముట్టేందుకు రష్యా బలగాలు తీవ్రంగా పోరాడుతున్నాయి. కీవ్ రష్యాకు చిక్కటానికి బహుశా ఎన్నో రోజులు పట్టకపోవచ్చు.
రష్యా తాను అనుకున్నది సాధించేందుకు ఒకవైపు చర్చలకు తలుపు తెరిచి ఉంచి మరోవైపు యుద్దాన్ని తీవ్రతరం చేసింది. తాజాగా తన అమ్ముల పొది నుంచి హైపర్‌సోనిక్ బాలిస్టిక్ మిసైళ్లను బయటకు తీసింది. దీనిని ప్రయోగించి ఉక్రెయిన్‌లోని భూగర్భ ఆయుధ డిపోను ధ్వంసం చేసింది. రొమేనియా సరిహద్దుకు 100 కి.మీ దూరంలోని డెలియాటిన్ గ్రామంలోని ఈ ఆయుధ డిపో ఉంది. దానిపై మిసైల్ దాడి వీడియోను రష్యా సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.
కింజాల్ అని పిలుస్తున్న ఈ అత్యాధునిక హైపర్‌సోనిక్ బాలిస్టిక్ మిసైల్ ని నాలుగేళ్ల క్రితమే రష్యా రూపొందించింది. సిరియా అంతర్యుద్ధంలో కూడా దీనిని ఉపయోగించనట్టు చెబుతారు. కానీ అందుకు ఎలాంటి ధృవీకరణలు లేవు. కానీ ఉక్రెయిన్ విషయంలో రష్యా రక్షణ శాఖ ఈ మిసైల్ ప్రయోగాన్ని ధృవీకరించింది. కానీ రష్యా మాటల్లో నిజం ఎంతో తెలియదు. ఉక్రెయిన్ దీనిని దృవీకరించాల్సి వుంది. కింజాల్ బాలిస్టిక్ మిసైల్స్‌ను గగనతలం నుంచి మిగ్-31 యుద్ధ విమానాల ద్వారా ప్రయోగిస్తారు.
కింజాల్ హైపర్‌సోనిక్ మిసైల్ శక్తి సామర్ధ్యాలపై పుతిన్‌కు చాలా నమ్మకం. అందుకే దీనిని ‘ఐడియల్ వెపన్’ (ఉత్తమ ఆయుధం) అని అభివర్ణించాడు. హైపర్‌సోనిక్ మిసైల్స్ పరంగా ఇది ప్రపంచానికే పెద్దన్న వంటిదని పుతిన్ గొప్పగా చెప్పుకున్నారు. అంతటి వేగంలో కూడా ప్రయాణం మధ్యలో దిశను మార్చుకోవటం దీని ప్రత్యేకత. కనుక వీటిని ట్రాక్ చేయడం చాలా కష్టం. అంతేకాదు సంప్రదాయబద్ధమైన కింజాల్ క్షిపణి న్యూక్లియర్ వార్‌హెడ్‌ను కూడా మోసుకెళ్లగలదు.
కింజాల్ క్షిపణి ధ్వని వేగంగా కన్నా అయిదు రెట్లు వేగంగా ప్రయాణిస్తుంది. దీని పనితీరు కూడా అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది. రష్యా చెప్పే దానిని బట్టి ఈ మిసైల్ గంటకు కనిష్టంగా 6000 కి.మీ వేగంతో 2000 కి.మీ దూర లక్ష్యాలను ఛేదించగలదు. అందుకే దీనిని చాలా దేశాలుగా ప్రమాదకరమైనదిగా బావిస్తున్నాయి. ఇవి సృష్టించే విధ్వంసం, ప్రాణనష్టం కూడా ఎక్కువే అని నమ్ముతున్నాయి. అయితే ఇప్పుడు వీటిని ఉక్రెయిన్ మీద ప్రయోగించటం ద్వారా రష్యా ఎంతవరకు ప్రయోజనం పొందుతుందో ముందు ముందు తెలుస్తుంది.
మరోవైపు కింజాల్ హైపర్‌సోనిక్ మిసైల్ పుతిన్ చెప్పినంత గొప్పదేమీ కాదని పశ్చిమ దేశాల మిస్సైల్ ఎక్సపర్ట్స్ పెదవి విరుస్తున్నారు. పశ్చిమ దేశాలను బెధిరించే ప్రయత్నం మాత్రమేనని కొట్టిపారేస్తున్నారు. ఆయుధ డిపోపై ఎక్కడ నుంచి దాడి జరిగిందో తెలియదని, దాని కచ్చితత్వం కూడా సందేహాస్పదమే అంటున్నారు. బహుశా కింజాల్ క్షిపణి ఒక ఇస్కాండర్ మిసైల్ అయి ఉండొచ్చంటున్నారు వారు. దానిని యుద్ధవిమానాలకు అనుగుణంగా మార్పు చేశారని అంచనా వేస్తున్నారు. పైగా, రష్యా వద్ద ఇవి పెద్ద సంఖ్యలో లేవని అంటున్నారు. కానీ ఉక్రెయిన్ మాత్రం కింజాల్ పేరు చెబితేనే హడలిపోతోంది. వీటిని ప్రయోగించి రాజధాని కీవ్‌ను వీలైనంత త్వరగా స్వాధీనం చేసుకోవాలని రష్యా భావిస్తోంది.
ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలైన తొలి రోజు నుంచి నేటి వరకు రష్యా బలగాలు వెయ్యికి పైగా క్షిపణులను ప్రయోగించాయని అమెరికా రక్షణ శాఖ అధికారులు అంటున్నారు. అదే నిజమైతే ఇది చాలా పెద్ద సంఖ్య కింద లెక్క. ఇది రష్యా ఆయుధ కొరతకు దారితీస్తుంది. అయితే యుద్ధంలో ఇలాంటి ప్రచారాలు మామూలే. ఏది నిజమో పోను పోను తెలుస్తుంది.