Hormuz Strait Crisis: హార్మూజ్ జలసంధిపై ఇరాన్ సంచలన ప్రకటన.. అమెరికా ముందు ఏడు షరతులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hormuz Strait Crisis: హార్మూజ్ జలసంధి వ్యవహారం ఇప్పుడు మరో మలుపు తీసుకుంది.. అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరో కీలక మలుపు తిరిగాయి. ఇరు దేశాల మధ్య చర్చలకు కొత్త ప్రయత్నాలు జరుగుతున్న వేళ ఇరాన్ కీలక ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది. ఖతార్ మధ్యవర్తిత్వం ద్వారా అమెరికాకు కొత్త అణు ప్రతిపాదనను పంపినట్లు ఓ సీనియర్ ఇరాన్ అధికారి వెల్లడించారు. అయితే, అణు చర్చలు ప్రారంభం కావాలంటే ముందుగా అమెరికా తమ ఏడు డిమాండ్లను అంగీకరించాలని ఇరాన్ స్పష్టం చేసినట్లు సమాచారం. ఇరాన్ పంపిన ప్రతిపాదనను అమెరికా ప్రస్తుతం పరిశీలిస్తున్నట్లు సదరు అధికారి తెలిపారు.
ఇరాన్ విధించిన ఏడు కీలక షరతులు
ఇరాన్ అగ్ర భద్రతా అధికారి మొహ్సెన్ రెజాయీ గురువారం రష్యా పర్యటన సందర్భంగా అమెరికాపై తమ వైఖరిని మరోసారి స్పష్టం చేశారు. అమెరికా ఏడు షరతులను అంగీకరించకపోతే హార్మూ్జ్ జలసంధిని తెరిచే ప్రసక్తే లేదని, చర్చలకు కూడా ముందుకు రాబోమని ఆయన హెచ్చరించినట్లు కథనాలు వెల్లడించాయి. ఇక, ఇరాన్ ప్రధానంగా అమెరికా ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలని డిమాండ్ చేస్తోంది. విదేశాల్లో స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయాలని, యుద్ధం వల్ల జరిగిన నష్టాలకు పరిహారం చెల్లించాలని కోరుతోంది. అంతేకాకుండా అమెరికా విధించిన నావికా దిగ్బంధనాన్ని ముగించాలని, ఈ ప్రాంతం నుంచి అమెరికా సైనిక బలగాలను ఉపసంహరించుకోవాలని పట్టుబడుతోంది. ఇవి ఇరాన్ వెల్లడించిన ప్రధాన డిమాండ్లలో కొన్ని కాగా, మొత్తం ఏడు షరతుల వివరాలు పూర్తిగా వెల్లడికాలేదు.
Also Read
- BrahMos Deal: డ్రాగన్ వెన్నులో వణుకు.. భారత్‌తో ఫిలిప్పీన్స్ భారీ బ్రహ్మోస్ డీల్! ఆట మొదలైంది..
- Jon Ossoff: 2028 యూఎస్ ప్రెసిడెంట్ రేసులో 39 ఏళ్ల కుర్రాడు? ఎవరీ జాన్ ఒసాఫ్!
- Abdul El-Sayed: అమెరికా సెనెట్లోకి కర్ణాటక అల్లుడు.. ట్రంప్‌కి దిమ్మదిరిగి బొమ్మ కనపడింది భయ్యా!
- Elon Musk: ఎవడైతే కత్తితో యుద్ధం చేస్తాడో, వాడు కత్తిపోటుకే బలవుతాడు.. మస్క్‌కు మున్ముందు మొసళ్ల పండగే!
అణు చర్చల విషయంలో అమెరికా పట్టుదల
మరోవైపు అణు ఒప్పందానికి సంబంధించిన అంశాలను చర్చల ప్రారంభ దశలోనే చేర్చాలని అమెరికా పట్టుబడుతోంది. ఇరాన్ మాత్రం ముందుగా తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతోంది. దీంతో చర్చలు ఏ అంశంతో ప్రారంభించాలనే విషయంలో ఇరు దేశాల మధ్య భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్నాయి. ఖతార్ ద్వారా ఇరాన్ పంపిన ప్రతిపాదనను అమెరికా పరిశీలిస్తున్నప్పటికీ, వాషింగ్టన్ నుంచి ఎలాంటి అధికారిక స్పందన వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇరు దేశాల మధ్య తదుపరి చర్చలు ఎప్పుడు ప్రారంభమవుతాయనే దానిపై కూడా స్పష్టత లేదు.
మళ్లీ యుద్ధం మొదలవుతుందా?
ఇరాన్, అమెరికా మధ్య యుద్ధాన్ని ముగించేందుకు మధ్యవర్తిత్వ దేశాలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. అయితే అమెరికా మధ్యంతర ఎన్నికల తర్వాత ఇరు దేశాల మధ్య సైనిక ఘర్షణలు మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇక, మంగళవారం మీడియాతో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యంతర ఎన్నికల అనంతరం సైనిక చర్యలను తిరిగి ప్రారంభించే అవకాశాన్ని పూర్తిగా తోసిపుచ్చలేదు. మరోవైపు, అమెరికా మళ్లీ దాడులకు దిగితే గతంలో కంటే తీవ్రంగా ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఫిబ్రవరి 28 నుంచి కొనసాగుతున్న ఉద్రిక్తతలు
ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై దాడులు చేసినట్లు కథనంలో పేర్కొన్నారు. దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. ఈ సంఘర్షణ క్రమంగా లెబనాన్‌కు కూడా విస్తరించింది. ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా, ఇజ్రాయెల్ మధ్య పోరాటం తీవ్రరూపం దాల్చింది. అనంతరం యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు కూడా ఈ ఘర్షణలో భాగమయ్యారు. సౌదీ అరేబియాలోని ఇంధన కేంద్రాలు, విమానాశ్రయాలు, ఇతర కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు కథనంలో పేర్కొన్నారు. మొత్తంగా ఖతార్ మధ్యవర్తిత్వంతో ఇరాన్ పంపిన కొత్త అణు ప్రతిపాదన ఇరు దేశాల మధ్య చర్చలకు మార్గం సుగమం చేస్తుందా? లేక ఏడు షరతుల విషయంలో పట్టువిడుపులు లేకపోవడంతో మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొంటుందా? అనేది ఇప్పుడు అంతర్జాతీయంగా ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి భవిష్యత్తుపై అందరి దృష్టి నెలకొంది.
తాజావార్తలు
-
Hormuz Strait Crisis: హార్మూజ్ జలసంధిపై ఇరాన్ సంచలన ప్రకటన.. అమెరికా ముందు ఏడు షరతులు..
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!
-
37 గంటల బ్యాటరీ బ్యాకప్, అడ్వాన్స్డ్ ANC ఫీచర్లు, Bose సౌండ్ టెక్నాలజీతో Moto Buds 2 Ultra లాంచ్..!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 12 రోజుల బ్యాటరీ లైఫ్, డ్యూయల్ GPS, gOLED డిస్ప్లేతో Moto Watch 2 Fit లాంచ్..!
-
Dhanteras 2026: లక్ష్మీ పూజ ఎప్పుడు చేయాలి? బంగారం కొనడానికి సరైన సమయం ఏది..?
ట్రెండింగ్
-
200MP పెరిస్కోప్ కెమెరా, ఏడేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7000mAh బ్యాటరీతో Motorola Signature 27 లాంచ్..!
-
IND vs SL 1st ODI: బీసీసీఐ కీలక నిర్ణయం.. విశాఖలో తొలి వన్డే.. వేదిక మార్పుకు కారణం ఇదే!
-
Brendan Taylor: 40 ఏళ్ల వయసులో బ్రెండన్ టేలర్ సెంచరీ.. 8 ఏళ్ల నిరీక్షణకు తెర.. టెస్టు క్రికెట్లో అరుదైన రికార్డు..!
-
Stock Market Rally: స్టాక్ మార్కెట్లో బుల్ జోరు.. సెన్సెక్స్ 2,000 పాయింట్ల జంప్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..!
-
Virat Kohli: కాలం ఎవరికీ ఆగదు.. విరాట్ కోహ్లీ ఆఖరి పోరాటం.. అయినా ఇంకా 14 కొట్టొచ్చు ఇలా!