India Pakistan: పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది భారతీయులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదుల, దాని వెనక ఉన్న పాకిస్తాన్‌పై భారత్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఉగ్రవాదులు, వారి వెనక ఉన్నవారు, మద్దతుదారులను భారత్ విడిచిపెట్టదని భారత ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. దీంతో, పాకిస్తాన్‌పై తీవ్ర చర్యలు ఉంటాయని అంతా భావిస్తున్నారు. ఇప్పటికే, భారత్ దౌత్యపరమైన చర్యల్ని మొదలుపెట్టింది. ‘‘సింధు జలాల ఒప్పందం’’ రద్దు చేయడంతో పాటు, పాకిస్థానీలకు వీసాలను రద్దు చేయడం, భారత గగనతలాన్ని పాక్ ఎయిర్‌లైనర్లకు మూసేసింది.
ఇదిలా ఉంటే, ఇప్పుడు ఆర్థికపరమైన దాడికి భారత్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. రెండు ఆర్థిక దాడులను ప్లాన్ చేస్తోంది. పాకిస్తాన్‌ని తిరిగి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌పోర్స్(FATF) గ్రే లిస్ట్‌లోకి తీసుకురావడానికి భారతదేశం చురుకుగా ప్రయత్నించే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి. రెండోది, ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాలకు నిధుల దుర్వినియోగం చేస్తుందని ఆరోపిస్తూ, అంతర్జాతీయ ద్రవ్యనిధి( ఐఎంఎఫ్) పాకిస్తాన్‌కి ఇస్తామని ఒప్పుకున్న 7 బిలియన్ డాలర్లను ఇవ్వద్దని ఒత్తిడి చేసే అవకాశం ఉంది. మూడేళ్ల ఆర్థిక ప్యాకేజీకి సంబంధించి 202 జూలైలో ఒప్పందం ఖరారైంది.
Read Also: Amaravati Relaunch: ప్రధాని మోడీకి శాలువా కప్పి ప్రత్యేక జ్ఞాపికను అందజేసిన సీఎం చంద్రబాబు!
జూన్ 2018లో పాకిస్తాన్‌ని గ్లోబల్ మనీలాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్ వాచ్‌డాగ్ ‘గ్రే లిస్ట్’’లో ఉంచింది. ఉగ్రవాద నిధుల్ని అరకట్టడానికి కట్టుబడి ఉన్నట్లు ప్రకటించిన తర్వాత పాకిస్తాన్‌ని అక్టోబర్ 2022లో జాబితా నుంచి తొలగించింది. బయటకు చూపించడానికి పాకిస్తాన్ తీవ్రవాద గ్రూపులతో సంబంధం ఉన్న వ్యక్తులకు జైలు శిక్ష, జరిమానా,ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంది. ఒక వేళ FATF గ్రే లిస్ట్ హోదాను పునరుద్ధరిస్తే పాకిస్తాన్ ఆర్థికంగా మరింత దివాళా తీస్తుంది. దేశంలోకి విదేశీ పెట్టుబడులు, మూలధన ప్రవాహం తగ్గుతుంది.
తదుపరి FATF ప్లీనరీ సమావేశాలకు ముందే భారత్ ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టాలని అనుకుంటోంది. భారత్ రాబోయే వారల్లో కీలకమైన FATF సభ్య దేశాలతో చర్చలు జరపనుంది. 40 సభ్య దేశాలతో కూడిన FATF యొక్క నిర్ణయాధికార సంస్థ ఈ ప్లీనరీ. ఈ ప్లీనరీ సాధారణంగా సంవత్సరానికి మూడుసార్లు, ఫిబ్రవరి, జూన్ మరియు అక్టోబర్‌లలో సమావేశమవుతుంది. ఇటీవల, పహల్గామ్ దాడిలో 26 మందిని ముష్కరులు పొట్టనపెట్టుకున్నారు. ఈ దాడి వెనక పాకిస్తాన్ ఐఎస్ఐ, పాక్ ఆర్మీ ఉందని తేలింది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారు.