రాజధాని అమరావతి పునఃనిర్మాణ పనుల కోసం ప్రధాని నరేంద్ర మోడీ వెలగపూడికి చేరుకున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి హెలికాఫ్టర్‌లో వెలగపూడి చేరుకున్న ప్రధానికి ఏపీ గవర్నర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలికారు. రోడ్ షోలో ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగిన ప్రధాని.. అమరావతి సభా వేదికపైకి చేరుకున్నారు. వేదికపై ప్రధానిని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ సన్మానించారు. ధర్మవరం శాలువాను కప్పి.. ప్రత్యేక జ్ఞాపికను అందజేశారు.
సభా వేదికపై కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, నారాయణ, నాదెండ్ల మనోహర్ ఉన్నారు. సభా వేదిక పైనుంచే పలు ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు చేయనున్నారు. హైకోర్టు, సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాలకు, న్యాయమూర్తుల నివాస సముదాయాలకు శంకుస్థాపన చేయనున్నారు. రూ. 57,962 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. నాగాయలంకలో రూ. 1500 కోట్లతో నిర్మించే మిసైల్ టెస్ట్ రేంజ్ కు శంకుస్థాపన.. రెండు రైల్వే లైన్లను జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోడీ.. రూ. 3,680 కోట్ల విలువైన నేషనల్ హైవూ పనులకు ప్రధాని శంకుస్థాపన.. రూ. 254 కోట్లతో పూర్తి చేసిన ఖాజీపేట- విజయవాడ 3వ లేన్ ప్రారంభోత్సవం జరగనున్నాయి.