రష్యా- ఉక్రెయిన్ ఉద్రిక్తలపై భారత్ అప్రమత్తం అయ్యింది.. ఉక్రెయిన్‌లోని భారతీయులు వెనక్కి రావాలని కోరింది భారత విదేశాంగ శాఖ.. ఇక, భారత పౌరులను తరలించేందుకు చర్యలను కూడా ప్రారంభించింది.. ఇవాళ రాత్రి ఉక్రెయిన్ నుంచి భారత్‌కు ప్రత్యేక విమానం రానుంది. భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి బోయింగ్ 787 విమానాన్ని ఏర్పాటు చేశారు. ఈ విమానంలో 200 మంది భారతీయులు స్వదేశానికి తిరిగిరానున్నారు. ఇక, ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది భారత్.. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఈ ప్రాంతంలో శాంతికి భంగం కలిగిస్తాయని పేర్కొంది. ఉక్రెయిన్ అంశంపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నిర్వహించిన అత్యవసర సమావేశంలో భారత శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి మాట్లాడుతూ.. అన్ని పక్షాలు శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. పరిష్కారం కోసం ఇరుపక్షాలకు వీలైనంత త్వరగా చర్యలు ప్రారంభించాలని సూచించింది భారత్..
Read Also: High Court: మారిటల్ రేప్.. కేంద్రం విజ్ఞప్తిని తోసిపుచ్చిన కోర్టు
ఇక, ఈ పరిస్థితులపై జాతిని ఉద్దేశించి ప్రసంగించిన రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఉక్రెయిన్ దగ్గర అణుబాంబు ఉందని ఆరోపించారు. కొన్నిదేశాల ఆర్మీ సహకారంతో రష్యాపై దాడికి ఉక్రెయిన్ ప్రయత్నిస్తోందన్నారు. చొరబాటుకు ప్రయత్నించిన ఐదుగురు ఉక్రెయిన్ సైనికులను రష్యా దళాలు కాల్చి చంపినట్లు తెలిపింది రష్యా.. ఇక, రష్యా బలహీనపడాలని అమెరికా కోరుకుంటోందని మండిపడ్డారు. తమపై దాడి చేస్తే తిప్పికొడతామని హెచ్చరించారు. అంతేనా డోనెట్క్స్, లుహాన్స్‌లను స్వతంత్ర రాజ్యాలుగా గుర్తిస్తూ, సంతకాలు చేశారు పుతిన్.. అయితే, ఉక్రెయిన్- రష్యా ఫెడరేషన్ సరిహద్దుల వద్ద నెలకొన్న ఉద్రిక్తతలు ఆ ప్రాంతంలో శాంతి, భద్రతలను ప్రభావితం చేసే అవకాశం ఉంది.. అన్ని దేశాల ప్రయోజనాల దృష్ట్యా ఉద్రిక్తతలను తగ్గించడమే తక్షణ ప్రాధాన్యం.. దౌత్యపరమైన చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించడం సాధ్యం అవుతుందని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి పేర్కొన్నారు.