Imran Khan: పాకిస్తాన్ ఆందోళనతో అట్టుడుకుతోంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను మే 9న అరెస్ట్ చేసిన తర్వాత పాకిస్తాన్ వ్యాప్తంగా ఆయన పార్టీ పీటీఐ కార్యకర్తలు, మద్దతుదారులు హింసాత్మక ఆందోళనకు దిగారు. అయితే పాక్ సుప్రీంకోర్టు ఆయన్ను విడుదల చేసినా కూడా ఆందోళనలు సద్దుమణగడం లేదు. ఇదిలా ఉంటే పంజాబ్ తాత్కాలిక ప్రభుత్వం తనపై కుట్ర పన్నుతోందని, ఈ హింసాత్మక ఆందోళనకు కారణం అవుతోందని ఆయన విమర్శించారు.
పాకిస్తాన్ విపత్తు దిశగా వెళ్తుందోన ఇమ్రాన్ ఖాన్ హెచ్చరించారు. పాకిస్తాన్ లోని 70 శాతం జనాబా తమ పార్టీకి మద్దతుగా ఉన్నారని, 30 శాతం మంది మాత్రమే పీఎం షహబాజ్ షరీఫ్ కూటమి ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారని ఓ సర్వేలో తేలిందని ఆయన అన్నారు. సైన్యాన్ని తమ పార్టీకి వ్యతిరేకంగా ఉంచడానికి అధికార పార్టీ కుట్ర పన్నిందని ఆయన ఆరోపించారు. బుధవారం లాహోర్ లోని అతని నివాసం జమాన్ పార్క్ లో మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణే పాకిస్తాన్ సమస్యకు పరిష్కారం అని ఆయన అన్నారు.
Read Also: BT Group: 55,000 ఉద్యోగాలను తొలగించనున్న యూకే టెలికాం దిగ్గజం
లండన్ లో ఉంటున్న మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ దేశం గురించి పట్టింపు లేదని, కేవలం దోచుకున్న సంపదను కాపాడుకోవడానికి తమ స్వార్థ ప్రయోజనాల కోసమే చూస్తున్నారని మండిపడ్డారు. ఈ దేశంలో తూర్పు పాకిస్తాన్( బంగ్లాదేశ్) పరిస్థితిని ఎదుర్కొంటోందని, హెచ్చరించారు. తాను సైన్యంపై చేసిన విమర్శలను తండ్రి కొడుకులను మందలించిన విధంగా చూడాలని అన్నారు. ప్రభుత్వ అంతర్గత విషయాల్లో సైన్యం జోక్యం చేసుకోవద్దని మరోసారి సూచించారు. తన ఇంట్లో 40 మంది ఉగ్రవాదులు ఉన్నారని పంజాబ్ ప్రభుత్వం చేస్తున్న వ్యాఖ్యల్ని కుట్రగా అభివర్ణించారు. తన ఇంట్లో ఎలాంటి ఉగ్రవాదులు లేరని నిరూపించేందుకు మీడియాను ఇమ్రాన్ తన ఇంట్లోకి అనుమతించారు.
మే 9న ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అయిన తర్వాత జరిగిన పరిణామాల్లో 10 మంది చనిపోయినట్లు పాక్ పోలీసులు చెబుతున్నారు, అయితే తమ కార్యకర్తలు 40 మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన వెల్లడించారు. రష్యా, చైనా, ఆఫ్ఘనిస్తాన్ లపై స్వతంత్ర విదేశాంగ విధాన నిర్ణయాల కారణంగా తనను లక్ష్యంగా చేసుకుని అమెరికా గద్దె దించిందని ఇమ్రాన్ ఆరోపిస్తున్నారు.